బనకచర్లపై అడ్డంగా దొరికిండు..రేవంత్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: హరీశ్ రావు

బనకచర్లపై అడ్డంగా దొరికిండు..రేవంత్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే: హరీశ్ రావు
  • తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: బనకచర్లపై బాగోతంతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆ చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కేటీఆర్​ను గంజాయి బ్యాచ్ అని అనడం దారుణమని, వాస్తవానికి రేవంత్ బ్యాచే ఓ గార్బేజ్ బ్యాచ్ అని విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో చిట్​చాట్ చేశారు. 

బనకచర్లపై చర్చే జరగలేని రేవంత్ అన్నారని, కానీ.. చర్చ జరిగిందని ఏపీ మంత్రి నిమ్మల చెప్పారని పేర్కొన్నారు. సీఎం రేవంత్​ నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. తెలంగాణకు వచ్చినప్పుడల్లా రాహుల్, ఖర్గే కూడా జై తెలంగాణ అంటారని గుర్తు చేశారు. రేవంత్​కు ఇంకా బానిస మనస్తత్వం పోలేదా? అని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబుకు తొత్తుగా ఉంటున్నారని విమర్శించారు.

సెక్రటేరియెట్​కు ఎందుకు పోతలేవు?

‘‘రేవంత్ లాగా కేటీఆర్ బ్యాగులు మోయలేదు. మంచి ఇంగ్లీష్​ మాట్లాడుతూ ప్రపంచంలో తెలంగాణ ఖ్యాతిని పెంచారు’’అని హరీశ్​ అన్నారు. రేవంత్ పాలన పోలీసుల మధ్యన కమాండ్ కంట్రోల్ సెంటర్​లో లేదంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచే నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ సెక్రటేరియెట్​కు ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. ప్రజాదర్బార్ కార్యక్రమమం ఏమైందని నిలదీశారు. అర్ధరాత్రి గోడలు దూకడం.. కార్లలో పోవడం రేవంత్​కు తప్ప ఎవరికి అలవాటుందని నిలదీశారు.