
‘కృషిం వినాన జీవన్తి జీవాః సర్వే ప్రణశ్యతి..తస్మాత్ కృషిం ప్రయత్నేన కుర్వీత్ సుఖసంయుతః’ అంటే వ్యవసాయం లేకుండా సృష్టిలో ఏ జీవి బతకలేదు. అన్నదాత లేకపోతే సకల సృష్టి ఆగమాగమవుతుంది. కర్షకధీరులు రుధిరాన్ని చిందిస్తే.. ధాన్యపురాసులు పుట్లుపుట్లుగా పుడతాయి. వ్యవసాయం అనేది కృషితో, ప్రయత్నంతో సకల జీవులకు ఆహారాన్ని అందించే మహత్తరమైన బాధ్యత. సకల సృష్టికి జీవనాధారం వ్యవసాయం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వ్యవసాయాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాలను గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నీరుగార్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా జరిగితే.. కేసీఆర్ దానిని దండగలా మార్చి అన్నదాతల ఉసురు పోసుకున్నారు. గత పదేళ్లలో దాదాపు 7 వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
పండించిన పంటలకు దిగుబడి సరిగ్గా రాక.. వచ్చిన అరకొర దిగుబడికి ధరలు లేక రైతులు నిస్సత్తువతో నీరసించారు. ఏ పంటను పండించాలన్నా ధరవస్తదో.. రాదోనన్న అనుమానం. పంట చేతికొచ్చాక ఏమవుతుందోనన్న భయం. ఇదీ నాటి కేసీఆర్ పాలనలో రైతు దుస్థితి. కేసీఆర్ అధ్వాన, నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ ప్రజాప్రభుత్వాన్ని.. రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలే తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థికవ్యవస్థను గాడినపెడుతూ.. మంత్రివర్గం అంతా కలిసి వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మారుస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర పాలనలోనే రైతు సంక్షేమం కోసం లక్షకోట్లకు పైగా ఖర్చుపెట్టింది. రైతు సంక్షేమం ప్రజాప్రభుత్వ లక్ష్యం అని చెప్పేందుకు ఈ గణాంకాలే సాక్ష్యం. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయనివిధంగా ఏకకాలంలో పంట రుణాలు మాఫీ చేయడం ప్రజాప్రభుత్వానికే సాధ్యమైంది. రెండు లక్షల రూపాయల వరకూ పంట రుణాల మొత్తం రూ. 21 వేల కోట్లను ఒకేసారి విడుదల చేసి రైతులను రుణ విముక్తులను చేసింది.
ఇందిరమ్మ రాజ్యం
రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంకింద ప్రతి ఎకరాకు రూ.12 వేల చొప్పున ప్రజాప్రభుత్వం అందిస్తోంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సాయం కింద 21 వేల 450 కోట్ల రూపాయలను 70 లక్షల మందికి అందించాం. ఈ ఏడాది వానాకాలం రుతుపవనాలు ముందుగానే రావడంతో కేవలం తొమ్మిదంటే తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా మొత్తం 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల కమిట్మెంట్కు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇదేకాక రైతు భరోసాతో పాటుగా డ్రిప్ సిస్టమ్, స్ప్రింక్లర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ అందిస్తున్నది . గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు మిగిలిన అన్ని సబ్సిడీలను ఎత్తేసిన విషయాన్ని ప్రతి రైతు ఇప్పుడు యాది చేసుకుంటున్నాడు. పంటలు వేయాలని రైతులను ప్రోత్సహించడంతోపాటు.. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ.. ప్రజాప్రభుత్వం ఇతర ప్రభుత్వాలకు ఒక దీపస్తంభంలా దారి చూపుతోంది. ఈ ఏడాది యాసంగిలో 128.23 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత ఏడాది అంటే 2023–-24 లో 95 లక్షల 31 వేల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగితే.. ఈ ఏడాది 32 లక్షల టన్నులు ధాన్యాన్ని అధికంగా ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఇతర దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి
నేడు తెలంగాణ ప్రభుత్వం అత్యంత నాణ్యమైన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇది రాష్ట్ర రైతులకు అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం తీసుకువచ్చిన గుర్తింపుగా చెప్పుకోవచ్చు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలులో తరుగు పేర రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తూ 21 లక్షల 77 వేల మంది రైతులకు రూ.29,726 కోట్ల మొత్తాన్ని వారివారి ఖాతాల్లో జమచేయడం ఒక అరుదైన విషయంగా రైతులు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలులో తరుగు పేరు మీద వేల కోట్ల రూపాయలు రైతులకు నష్టం కలిగించారు. ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూసిన ఘటనలున్నాయి. గత ప్రభుత్వం వరి పంట విషయంలో అనేక ఆంక్షలు విధించి రైతులను ఆగం చేస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వంలో సన్నబియ్యంకు రూ.500 బోనస్ అందిస్తోంది. దీంతో రైతులకు అదనపు ఆదాయం లభించడంతోపాటు.. సన్నరకం ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. గత ఏడాది వానాకాలంలో ప్రభుత్వం 23.98 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని సేకరించి రూ.1199 కోట్లను బోనస్ గా రైతులకు అందించింది. యాసంగిలో ప్రభుత్వం సేకరించిన సన్నరకం ధాన్యానికి రూ.1162 కోట్ల బోనస్‌ను రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది.
రారాజులుగా అన్నదాతలు
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వీటి కోసం రూ.245 కోట్లను ఖర్చు చేయడంతో నిలిచిపోయిన 16 కేంద్ర ప్రాయోజిత పథకాలు మళ్లీ మొదలయ్యాయి. రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం కావాలి. రాష్ట్రం నలుమూలల ఎటు చూసినా భూములన్నీ పచ్చదనం సంతరించుకుని.. సిరుల మాగాణులు కావాలి. అన్నదాతలు నిత్యం పంట పొలాల్లో వ్యవసాయ పనుల్లో కలియతిరగాలి. ప్రాజెక్టుల నుంచి గంగమ్మ ఉరుకులు పెడుతూ.. పాతాళగంగమ్మ పైకి ఎగిసి వస్తూ.. పొలాలను సుందర హరితాలుగా మార్చాలి. అప్పుడే అన్నదాతలు రారాజులుగా మారి.. సకల జనులకు ఆహారధాన్యాన్ని అందిస్తారు. పుడమితల్లికి ఆకుపచ్చని చీర కట్టినట్లుగా.. సుందరమైన పంటపొలాలతో నా తల్లి తెలంగాణ విలసిల్లాలని మా ప్రభుత్వం తపన పడుతోంది. అందుకోసం అధికారంలోకి వచ్చిన నాటినుంచే వేల కోట్లను ఖర్చుచేస్తోంది. మాది రైతు ప్రభుత్వం.. రైతు సంక్షేమ ప్రభుత్వం.
బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత
కేసీఆర్ హయాంలో రైతులు పండించిన వరి మినహా ఇతర పంటలను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే ప్రజాప్రభుత్వం మాత్రం రైతులకు ఇబ్బందులు లేకుండా, ఎంఎస్పీలో పంటలను మార్క్‌ఫెడ్ ద్వారా 2024-–25లో 1.33 లక్షలమంది రైతుల నుంచి రూ.1132 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు 11 లక్షల 67వేల టన్నుల ఎరువులను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. దేశంలో మరెక్కడాలేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున బిందు, తుంపర సేద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకూ రూ.282 కోట్ల విలువైన బిందు, తుంపర సేద్య పరికరాలను రైతులకు ప్రభుత్వం అందించింది. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడంతో వ్యవసాయశాఖలో పలు కేంద్ర ప్రాయోజిత పథకాలు పూర్తిగా నిలిచిపోయాయి.
వ్యవసాయం కోసం చేసిన నిధుల ఖర్చుల వివరాలు (రూ.కోట్లలో)
రైతు రుణమాఫీ 20,616.89
రైతు పెట్టుబడి సాయం 7,625.00
రైతు భరోసా 5057.77
(28.03.25 వరకూ, 56.81 లక్షల మంది రైతులకు)
రైతు భరోసా వానాకాలం 9,000.00
రైతు బీమాకు ప్రీమియం 2181.00
పచ్చిరొట్టె విత్తనాల సబ్సిడీ 122.65
పంటనష్టం 260.00
డ్రిప్, స్ప్రింక్లర్ సబ్సిడీ 282.45
ఆయిల్‌పామ్ సాగు సబ్సిడీ 244.77
పట్టుగూళ్ల ప్రోత్సాహం 7.80
మార్కెట్ యార్డుల్లో అభివృద్ధి పనులు 181.98
రైతువేదికల్లో టీవీల ఏర్పాటు 59.00
సన్నాలకు బోనస్ 1,149.00
మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోళ్లు 292.62
(యాసంగి 2023-24)
మార్క్ ఫెడ్ ద్వారా పంట కొనుగోళ్లు 1121.88
(ఇప్పటివరకూ 2024-25)
ధాన్యం కొనుగోళ్లు (రబీ 2023-24) 10,549.00
ధాన్యం కొనుగోళ్లు (ఖరీఫ్ 2024-25) 12,511.00
ధాన్యం కొనుగోళ్లు (రబీ 2024-25) 16,107.77
అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వారి మంత్రివర్గం కూడా మాకు వ్యవసాయం, రైతులే ముఖ్యం అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చెప్పినవిధంగానే ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రైతుల కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం అనేది మామూలు విషయం కాదు.
- అన్వేష్ రెడ్డి సంకేట,
చైర్మన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ,
తెలంగాణ కిసాన్ కాంగ్రెస్