50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర

50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ బస్సు యాత్ర కోసం బీఆర్‌‌ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. బస్సు యాత్ర ఆసాంతం ర్యాలీగా తిరగడానికి 50 కార్లను బుక్‌ చేసినట్టు తెలిసింది. పార్టీ అనుబంధ సంఘాలలో పనిచేస్తున్న వంద మందిని వలంటీర్లుగా నియమించింది. రెండ్రోజులుగా వారికి పార్టీ నాయకులు ట్రైనింగ్ ఇస్తున్నారు. వీళ్లంతా నిత్యం కేసీఆర్‌‌తో పాటు యాత్రలో పాల్గొననున్నారు. కేసీఆర్‌‌కు వీళ్లే బాడీగార్డులుగా ఉంటారని, ప్రత్యేకంగా బౌన్సర్లను పెట్టుకోవడం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. 

ఉద్యమ కాలంలో పోయినట్టుగా నేరుగా జనాలతోనే కేసీఆర్ మమేకం అవుతారని, వారితో ముచ్చటించేలా యాత్రను ప్లాన్ చేశామని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ నెల 24న మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తారని, తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారని ఆయన తెలిపారు. స్వల్ప ప్రసంగం అనంతరం భవన్ నుంచి బస్సు యాత్ర మొదలవుతుందన్నారు. రోజూ సాయంత్రం బస్సు యాత్ర జరగనుండగా, రాత్రికి స్థానికంగానే కేసీఆర్ బస చేయనున్నారు. 

ఉదయం స్థానికంగా ఉన్న సమస్యలపై అక్కడి వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ముఖాముఖి భేటీ అవుతారని చెప్పారు. యాత్రలో భాగంగా ఎండిన పొలాలను, ఎండిన చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదో ఒక బ్యారేజీని కూడా కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై బస్సు యాత్ర షెడ్యూల్‌లో ఎలాంటి ప్రస్తావన లేదంటున్నారు.

రూరల్ ఓట్లపై ఫోకస్

అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, పింఛన్‌దారుల ఓట్లన్నీ తమకే పడుతాయని బీఆర్ఎస్​ భావించింది. కానీ, ఇందుకు విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్‌‌ఎస్ ఎక్కువగా ఓట్లను నష్టపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌‌లో పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాత్రమే పట్టు నిలుపుకోగలిగింది. మొత్తంగా బీఆర్‌‌ఎస్ గెలిచిన 39 సీట్లలో, 16 సీట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గ్రామీణ ఓటర్లు, వ్యవసాయ సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. 

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులు, రైతు కూలీలకు ఆర్థిక సాయం, వరికి రూ.500 బోనస్ వంటి అంశాలపై ప్రచారం చేసి లబ్ధి పొందాలని బీఆర్‌‌ఎస్ భావిస్తున్నది. కేసీఆర్ బస్సు యాత్రలో కూడా ప్రథమ ప్రాధాన్యత రైతులకు సంబంధించిన అంశాలకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పొలాలు, చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులను కేసీఆర్ పరిశీలించడానికి, రైతులతో ముఖాముఖిలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తున్నది.