బజార్లో ఉన్న పసునూరిని ఎంపీ చేసినా పార్టీ మారిండు: ఎర్రబెల్లి దయాకర్​ రావు

బజార్లో ఉన్న పసునూరిని ఎంపీ చేసినా పార్టీ మారిండు:  ఎర్రబెల్లి దయాకర్​ రావు
  • .    రేవంత్​ మూడుసార్లు గెలిచిసీఎం అయిండు.. 
  •     ఏడుసార్లు గెలిచి ఇక్కడే ఉన్నా: ఎర్రబెల్లి దయాకర్​ రావు
  •     కడియం శ్రీహరి మాదిగ కాదు,మాల కాదని కామెంట్స్

వరంగల్‍/వర్ధన్నపేట, వెలుగు : ‘‘బజార్లో ఉన్న పసునూరి దయాకర్‍ను తీసుకొచ్చి.. రూపాయి లేకున్నా ఎంపీ చేసిన మహనుభావుడు కేసీఆర్‍. అట్లాంటి పసునూరి కూడా పార్టీ మారిండు” అని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. శుక్రవారం వర్ధన్నపేటలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘‘రేవంత్‍రెడ్డి ఎవరో కాదు నా శిష్యుడే. మోసాలు చేస్తడు.. అబద్ధాలు ఆడుతడు.. జిమ్మిక్ లు చేస్తడు. జనాలు మోసపోతే పోనియ్యి అంటడు. మూడుసార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి అయిండు.. ఏడుసార్లు గెలిచినోన్ని ఇక్కడ మీ ముందున్నా. 

అబద్ధాలాడేటోడే ముందుకుపోతున్నడు. న్యాయమనేది లేదు. అయినా రేవంత్ ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగడు. తక్కువ టైంలోనే కాంగ్రెస్‍ పార్టీపై జనాల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ ప్రభుత్వం ఏడాదిలోనే కూలిపోతుంది” అని అన్నారు. ‘‘కడియం శ్రీహరిని మా నాన్నే చదివించిండు. నేను ఒక్కసారి ఓడిపోగానే కడియం నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నడు. నాలుగుసార్లు ఓడిన శ్రీహరికి సిగ్గులేదా.? ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అవకాశాలను తీసుకుని పార్టీకి నమ్మకద్రోహం చేసిన చరిత్ర అతనిది. కడియం శ్రీహరి అసలు మాదిగ కాదు. మాల కాదు”అని అన్నారు.