- గతేడాది రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత
- షేర్, బబ్బర్‌షేర్ అంటూ బీఆర్ఎస్. కాంగ్రెస్ జబ్బలు చరుచుకుంటున్నయ్.. ‘రాజధాని రణభేరి’ సభలో కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ ఫేక్ అగ్రిమెంట్లు, బూటకపు లెక్కలతో నిర్వహించతలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటామని టీఆర్ఎస్ చీఫ్ కవిత హెచ్చరించారు. గతేడాది తెచ్చామన్న రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మియాపూర్‌లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులతో నిర్వహించిన ‘రాజధాని రణభేరి’ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. తాము షేర్లమని బీఆర్ఎస్, బబ్బర్షేర్లమని కాంగ్రెస్ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారని, అయితే ఆ పులులన్నింటినీ బోనులో బంధించే అసలైన వేటగాడు (టీఆర్ఎస్) వచ్చాడన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, అన్నిచోట్ల పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని చెప్పారు.
గుక్కెడు నీళ్లివ్వలేరు కానీ.. విశ్వనగరమా?
హైదరాబాద్ అభివృద్ధికి పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నామని, కానీ అబద్ధాలు, బోగస్ పెట్టుబడులతో ప్రజలను మభ్యపెడితే ఊరుకోబోమని కవిత స్పష్టం చేశారు. నగర ప్రజలకు కనీసం తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేని పాలకులు.. హైదరాబాద్‌ను లండన్, న్యూయార్క్ చేస్తామంటూ విశ్వనగరమని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. నగరంలో చెత్త సేకరించే 50 వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, సీఎం ఇంటి ఎదుటే చెత్త కుమ్మరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సోదరుల భూకబ్జాల వల్ల నగర పరిసరాల్లో విలువైన పంట భూములు కనుమరుగవుతున్నాయని ఆరోపించారు. ఏఐ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోతున్న ఐటీ నిపుణులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సరైన విధానం లేదని విమర్శించారు.
