బీఆర్ఎస్ నేత షకీల్‌‌ కొడుకు అరెస్ట్

బీఆర్ఎస్ నేత షకీల్‌‌ కొడుకు అరెస్ట్
  • హైకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన రాహిల్‌‌
  • కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • ఈ నెల 22 వరకు రిమాండ్‌‌

హైదరాబాద్‌, వెలుగు: బోధన్‌  మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌‌ఎస్  నేత షకీల్‌  కొడుకు మహ్మద్‌  ఆమీర్‌‌  రాహిల్‌ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసుల ముందు అతను లొంగిపోయాడు. పోలీసులు అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈనెల22 వరకు కోర్టు జ్యుడీషియల్  రిమాండ్‌   విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

రాహిల్‌  అరెస్టు వివరాలను వెస్ట్‌జోన్  డీసీపీ విజయ్‌ కుమార్  ప్రకటించారు. నిరుడు డిసెంబర్ 23న అర్ధరాత్రి దాటిన తరువాత పంజాగుట్ట పీఎస్‌  పరిధిలోని ప్రజాభవన్‌  సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి పాల్పడింది రాహిలేనని ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అతను పారిపోయాడు. మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు కేసును తారుమారు చేశారు. 

కేసులో అబ్దుల్‌  ఆసిఫ్‌ అనే వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. అయితే సీసీటీవీ ఫుటేజీలో నిజం బయటపడింది. రాహిల్‌ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్  దుర్గారావు సహకరించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో ఆయనపై సస్పెన్షన్  వేటు వేశారు. దుర్గారావుతో పాటు నిజామాబాద్‌  మాజీ ఇన్‌స్పెక్టర్‌‌   ప్రేమ్‌కుమార్‌‌ను కూడా సస్పెండ్‌ చేశారు. వారితో పాటు ఈ కేసులో మొత్తం15 మందిని అరెస్టు చేశారు. రాహిల్‌పై లుక్‌ ఔట్  నోటీసు‌ జారీ చేశారు. లుక్ ఔట్‌  సర్క్యులర్‌‌ను రద్దు చేయాలంటూ రాహిల్‌.. హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులకు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆదివారం పంజాగుట్ట పోలీసుల ముందు లొంగిపోయాడు.