కరీంనగర్, వెలుగు : కరీంనగర్ దోపిడీ ఘటనను బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్‌పర్సన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌తో కలిసి సోమవారం పీఎంజే జువెల్లరీ షాప్‌ను పరిశీలించిన అనంతరం బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... దుండగుల కాల్పుల్లో సిబ్బంది గాయపడడం దురదృష్టకరమన్నారు. గాయపడిన వారిని అవసరమైతే హైదరాబాద్‌కు తరలిస్తామని చెప్పారు. దుండగులను ఎదిరించి పోరాడిన సిబ్బందికి మనోధైర్యం ఇవ్వడం వదిలేసి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని, పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి డ్రగ్స్ కల్చర్, పబ్ కల్చర్, గంజాయిపై ఉక్కుపాదం మోపారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అడ్వకేట్ వామన్‌రావు దంపతులను నడిరోడ్డుపై చంపినా దిక్కు లేకుండా పోయిందని, దిశ లాంటి ఎన్నో ఘటనలు జరిగాయన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. పోలీస్ డిపార్ట్‌మెంట్ చాలా చురుకుగా పనిచేస్తోందన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి పది నిమిషాలకు ఒకసారి మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. కౌశిక్‌రెడ్డి క్వారీ యజమానిని బెదిరించి ఎలా డబ్బులు దండుకున్నారో అందరికీ తెలుసన్నారు.
