
ఉమ్మడి జిల్లాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లోనూ అధికార పార్టీ లీడర్ల జోక్యం పెరుగుతోంది. చిన్న పోస్టులను సైతం ఎమ్మెల్యేలు, వారి అనుచరులు తమకు కావాల్సిన వారికే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటి కోసం కొందరు లక్షల్లో డబ్బులు వసూలు చేసి, ఎమ్మెల్యేలతో రికమండేషన్లు ఇప్పిస్తున్నారనే ఆరోపనలు ఉన్నాయి. చిన్న పోస్టులకు సైతం ఎమ్మెల్యే రికమండ్ చేయడం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఇలాంటి ఘటనే తాజా భైంసాలో వెలుగు చూసింది. ఐసీడీఎస్ ఆఫీస్ లో ఉన్న ఒక సబ్ ఆర్డినేటర్ అవుట్ సోర్సింగ్ పోస్టుకు జిల్లా అధికారులు ఒకరి నియామకాన్ని ఖరారు చేస్తే.. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో పోస్టింగే ఆగిపోయింది.
అధికారులు ఒకరికి.. ఎమ్మెల్యే మరొకరికి
నిర్మల్ జిల్లా భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్‌లో సబ్ ఆర్డినేటర్ పోస్టు ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసేందుకు జిల్లా ఆఫీసర్లు నాలుగు నెలల క్రితం ఆదేశాలు జారీ చేశారు. అయితే అదే ఆఫీస్‌లో నాలుగేండ్లుగా పని చేస్తున్న సావిత్రిని తీసుకోవాలని అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో డీడబ్ల్యూఓ విజయలక్ష్మి సావిత్రిబాయిని ఔట్ సోర్సింగ్ లో తీసుకోవాలని భైంసా ఆఫీస్‌కు 2022 నవంబర్ 9న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా.. పోస్ట్ ఖాళీగా ఉందని తెలుసుకున్న కొందరు పైరవీలు షురూ చేశారు. సావిత్రి బాయికి పోస్టింగ్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ కొందరు స్వాతి అనే మహిళకు ఈ పోస్టు ఇప్పిస్తామని నమ్మించారు. ఆమె నుంచి డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. దీంతో స్వాతికి పోస్టింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రికమండేషన్ లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాగా.. సావిత్రికి పోస్టింగ్ ఇవ్వాలని మరోమారు ఎమ్మెల్యే రికమండేషన్ లెటర్ ఇచ్చారు.
సందిగ్ధంలో పోస్టు భర్తీ...
ఎమ్మెల్యే వరుస రికమండేషన్లతో వివాదం రావడంతో నియామకంపై సందిగ్ధం నెలకొంది. రికమండేషన్ విషయంలో కొందరు తనను తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జిల్లా ఆఫీసర్లతో చెప్పినట్టు సమాచారం. అధికారులు ఎటూ తేల్చలేక ఈ నియామకాన్ని తాత్కాలికంగా ఆపేశారు.
విచారణ చేస్తున్నాం.
భైంసా ఐసీడీఎస్ సబ్ ఆర్డినేటర్ పోస్టు భర్తీని తాత్కాలికంగా నిలిపివేశాం. ప్రస్తుతం సావిత్రిబాయితో పాటు స్వాతి అనే మహిళ ఎమ్మెల్యే రికమండేషన లెటర్ పొంది ఉన్నారు. ఈ పోస్టు వివాదంలో ఉండడంతో జిల్లా కలెక్టర్‌కు పూర్తి వివరాలు ఇచ్చాం. రెండు, మూడ్రోజుల్లో పోస్టు ఫైనల్ చేస్తాం.
- విజయలక్ష్మీ, డీడబ్ల్యూవో
నాకు న్యాయం చేయండి.
ఇక్కడ ప్రాజెక్టు ఆఫీస్ ఏర్పాటైన నుంచి కూలీగా పని చేస్తున్నా. నాకు ఔట్ సోర్సింగ్‌లో తీసుకోవాలని ఆఫీసర్లను వేడుకుంటున్నా. ఈ పోస్టును కక్ష పూరితంగా ఇంకొకరికి ఇప్పించేందుకు చూస్తుండ్రు. ఎమ్మెల్యే సైతం నాకు జాయిన్ చేసుకోవాలని రికమండేషన్ లెటర్ ఇచ్చాడు. నాకు న్యాయం చేయాలి. - సావిత్రిబాయి, భైంసా