
నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణ పడి ఉంటానని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 2023, అక్టోబర్ 25వ తేదీ బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిప్పర్తి మండల బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో వెంకట్ రెడ్డి.. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు మీడియా సమావేశంలో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నయ వంచనకు గురయ్యారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే... తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని వెంకట్ రెడ్డి కోరారు. గతంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను తిరిగి చేపడతానని,తన ఫౌండేషన్ తరుఫున కూడా పనులు ప్రారంభిస్తానని ఆయన చెప్పారు.
ప్రజలు తరపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. మేము ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని.. ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.