గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!

గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో  తప్పంతా ఆఫీసర్లదేనట.!
  • పదేండ్లపాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్​ పెద్దలు
  • అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు
  • కాళేశ్వరం, కరెంట్ ​కొనుగోళ్లు మొదలు ఫోన్​ ట్యాపింగ్ దాకా ఇదే సీన్​
  • నాడు సర్కారు చెప్పినట్టు చేసి.. నేడు కేసులపాలవుతున్న అధికారులు
  •  ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ​సర్కారు
  • నాటి ప్రభుత్వంతో అంటకాగిన ఐదారుగురు ఐఏఎస్​లలో తీవ్ర ఆందోళన

హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ ​పెద్దలు.. తాజాగా కాళేశ్వరం, కరెంట్​ కొనుగోళ్లలో బయటపడ్డ అక్రమాలను, ఫోన్​ ట్యాపింగ్ తదితర బాగోతాలను మాత్రం  ఆఫీసర్లపై రుద్దుతున్నారు. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్​ గీశానన్న మాజీ సీఎం కేసీఆర్​ ఇప్పుడు ‘కాళేశ్వరం డిజైన్​గీసేందుకు నేనేమైనా ఇంజినీర్​నా?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాను దగ్గరుండి చత్తీస్​గఢ్​ కరెంట్ కొన్నానని ఇన్నాళ్లూ చెప్పిన ఆయన, నాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో తనకెలాంటి సంబంధం లేదని, అంతా ఈఆర్సీ, ఉన్నతాధికారులే చూసుకున్నారని చెప్తున్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసు కూడా డిపార్ట్​మెంట్​వ్యవహారం అంటున్నారు. పదేండ్లపాటు ప్రభుత్వాన్ని నడిపి,  కాళేశ్వరం నుంచి కరెంట్​కొనుగోళ్ల దాకా, ధరణి నుంచి ఫోన్​ ట్యాపింగ్​దాకా  అన్నీ తామై వ్యవహరించిన బీఆర్ఎస్​ముఖ్య​నేతలు, తీరా బయటపడ్తున్న లోపాలకు, ఆరోపణలకు తమను బలిపశువులను చేయడాన్ని ఆఫీసర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్​ కొనుగోళ్లపై  జ్యుడీషియల్​​ ఎంక్వైరీ మొదలై పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు అందాయి. 

ఫోన్​ ట్యాపింగ్​వ్యవహారంలో నలుగురు పోలీస్​ఆఫీసర్లు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. పార్లమెంట్​ ఎన్నికలు పూర్తికాగానే  మరిన్ని కేసులు, అరెస్ట్​లు ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తమకు అండగా నిలుస్తారనుకున్న నాటి ముఖ్య నేతే.. తప్పులన్నింటినీ తమపై నెడుతుండటంతో ఆయా ఉన్నతాధికారులు, పోలీస్ ఆఫీసర్లు నిశ్చేష్టులవుతున్నారు. 

కాళేశ్వరంలో లోపాలకు ఆఫీసర్లే బలి..

నిరుడు అక్టోబర్‌‌‌‌ 21న  కాళేశ్వరంలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగిన విషయం తెలిసిందే. డిజైన్, నిర్మాణం, నిర్వహణా లోపం వల్లే బ్యారేజీ కుంగిందని  నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ నివేదికలు స్పష్టం చేశాయి. కానీ డిజైన్​తో తమకు ఎలాంటి సంబంధం లేదని, సర్కారు ఇచ్చిన డిజైన్​ ప్రకారమే తాము కట్టామని, కుంగిపోయినా, కూలిపోయినా తమ బాధ్యత లేదని పనులు చేపట్టిన ఎల్​అండ్​టీ సంస్థ చేతులెత్తేసింది. తన మేధస్సును కరిగించి కాళేశ్వరం డిజైన్​ గీశానని అధికారంలో ఉన్నప్పడు చెప్పిన మాజీ సీఎం కేసీఆర్​, తీరా ఇటీవల ఓ ప్రైవేట్​టీవీ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎలాంటి డిజైన్​ ఇవ్వలేదని, డిజైన్ ​గీసేందుకు తాను ఇంజినీర్​కాదని చెప్పారు. ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​ కోసం ప్రత్యేకంగా నాగేందర్​ అనే ఈఎన్సీని, సీఈని నియమించామని, వాళ్లు లోపాలను ఇన్​టైంలో గుర్తించి సర్దకపోవడం వల్లే పియర్లు కుంగాయని చెప్పి తప్పించుకున్నారు. సర్కారు పెద్దలు చెప్పారని గడువు తీరకముందే కాంట్రాక్ట్​సంస్థకు ఆఫీసర్లు డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​ సర్టిఫికెట్ఇచ్చి, బిల్లులు చెల్లించారని, దీని వల్లే ఆపరేషన్​ అండ్​మెయింటనెన్స్ ను కాంట్రాక్ట్​ సంస్థ నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఇంజినీర్లు చెప్తున్నారు.

తీరా ఇప్పుడు నాటి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు తప్పించుకొని ఆ నెపాన్ని  తమపై నెడుతుండడంతో నాటి ఇంజినీర్లు, ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరంపై ఇప్పటికే ఎంక్వైరీ ప్రారంభించిన  జస్టిస్​ పీసీ ఘోష్​ బుధవారం హైదరాబాద్ చేరుకొని సంబంధిత ఇంజినీర్లతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగినప్పటి నుంచి మేడిగడ్డ కుంగిపోయే వరకు ఏయే అధికారి ఎక్కడెక్కడ? ఏయే విధులు నిర్వర్తించారనే వివరాలను ఆయన ఇప్పటికే అడిగి తీసుకున్నారు. సీఎస్, ఇరిగేషన్​ మంత్రులు,  ఆ శాఖ సెక్రెటరీలు​, ఈఎన్సీలు, సీఈలుగా ఎవరు ఉన్నారని ఆరా తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో పలువురు ఇంజినీర్లు, అధికారులకు త్వరలోనే ఎంక్వైరీ కోసం నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతుండడంతో అందరిలోనూ టెన్షన్​ నెలకొంది.  

విద్యుత్ ​​కొనుగోళ్ల వెనుక ఉన్నదెవరో!

విద్యుత్​ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర విభజన నాటికి  రూ. 7,259 కోట్ల బకాయిలుండగా, బీఆర్​ఎస్​ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో బకాయిలు దాదాపు రూ. 1.10 లక్షల కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. భద్రాద్రి , యాదాద్రి  పవర్​ ప్లాంట్ల నిర్మాణాల్లో, పవర్​ పర్చేజ్​ అగ్రిమెంట్లలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. దీంతో విద్యుత్​ కొనుగోళ్లలో అక్రమాలను నిగ్గుతేల్చేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం జస్టిస్​ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిటీ వేసింది. ఈ క్రమంలో చత్తీస్​గఢ్​ ఒప్పంద సమయంలో ఉన్న ఉన్నతాధికారులకు ఈ నెల 14న  నోటీసులు ఇచ్చారు. వీరిలో మాజీ ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు, సదరన్​ డిస్కం మాజీ సీఎండీ  రఘుమారెడ్డి, నార్తర్న్​ డిస్కం మాజీ సీఎండీలు వెంకటనారాయణ, గోపాల్​రావు, సదరన్​ డిస్కం, నార్తర్న్​ డిస్కం మాజీ  డైరెక్టర్లు , ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ఉన్నారు. ఈ నెలఖారులోగా వీరితో పాటు ఇతర అధికారులనూ ఎంక్వైరీ చేసేందుకు రెడీ అవుతున్నారు.  తాజాగా, ఓ ప్రైవేట్​టీవీ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అంతా ఆఫీసర్లే చూసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్​చెప్పడం గమనార్హం. 

భగీరథకు ఎవర్ని బలి చేస్తరో!

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం రూ.40వేల కోట్లకు పైగా ఖర్చు చేసి తెచ్చిన మిషన్​భగీరథ స్కీంలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. పాత పైపులకే కొత్త కనెక్షన్లు ఇచ్చి, పాత ట్యాంకులకే కొత్తగా రంగులు వేసి , ఆ మాటున కోట్లు పక్కదారి పట్టించారనే అనుమానాలున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ తరుచూ పైపులైన్లు పగిలిపోవడాన్ని కాంగ్రెస్​ సర్కారు సీరియస్​గా తీసుకుంది. సెకండరీ, ఇంట్రా పైప్​లైన్ల పేరుతో రూ.6 నుంచి 7 వేల కోట్లు పక్కదారి పట్టించారనే అనుమానాలతో విజిలెన్స్​ ఎంక్వైరీకి ఆదేశించింది. ఇప్పుడు ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన నెలకొంది. దీంతో పాటు ఓఆర్ఆర్  టోల్‌‌‌‌‌‌‌‌టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏకంగా 30 ఏండ్ల కాలానికి ముంబై కంపెనీ ఐఆర్‌‌‌‌‌‌‌‌బీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌డెవలపర్స్‌‌‌‌‌‌‌‌లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కి గత రాష్ట్ర ప్రభుత్వం రూ.7,380 కోట్లకే కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీని​పైనా కొత్త సర్కారు ఫోకస్​ పెట్టింది. హైదరాబాద్​ లో ఫార్ములా-ఈ రేస్​ నిర్వహణకు ప్రభుత్వం తరుపున సీఎస్​ అర్వింద్​కుమార్​ రూ.55 కోట్ల అడ్వాన్స్ ను అప్పనంగా చెల్లించడం అప్పట్లో తీవ్ర దుమారం  రేపింది. నాటి మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలమేరకే చెల్లించినట్టు అర్వింద్​చెప్పినప్పటికీ.. అర్వింద్​ కెరీర్​కు ఇదో మచ్చలా మిగిలింది. తాజా పరిణామాలను బట్టి ఈ వ్యవహారాలన్నీ తమ మెడకే చుట్టుకునే అవకాశముండడంతో సంబంధిత ఆఫీసర్లకు గుండె దడ మొదలైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నలుగురు అరెస్ట్​ 

రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో నాడు ఎస్ఐబీలో కీలకపాత్ర పోషించిన నలుగురు పోలీస్​ఉన్నతాధికారులు ఇప్పటికే అరెస్టయి చంచల్​గూడ జైల్లో ఉన్నారు. ప్రతిపక్ష నేతలు, ప్రైవేట్​వ్యక్తుల ఫోన్లను ట్యాప్​చేయడం, ఆధారాలను ధ్వంసం చేయడం, ఎన్నికల్లో డబ్బు రవాణా, పంపిణీ, ఇతర అక్రమాలకు పాల్పడ్డ కేసుల్లో ఇప్పటివరకు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్​కాగా, మరో నిందితుడు ప్రభాకర్​రావు అమెరికాలో ఉన్నారు. మరో ముగ్గురు ఏసీపీలు, 8 మంది ఇన్ స్పెక్టర్లు,15 మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డులు విచారణ ఎదుర్కొంటున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల సూచనమేరకే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్​చేసి, రాజకీయంగా వాళ్లను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి.