ఓటర్లకు గాలం వేసే కార్యక్రమాలు షురూ చేసిన బీఆర్ఎస్ నేతలు

ఓటర్లకు గాలం వేసే కార్యక్రమాలు షురూ చేసిన బీఆర్ఎస్ నేతలు
  • అన్నిపార్టీల కంటే ముందే  బీఆర్ఎస్ ​నేతల వ్యూహాలు
  • ఓటర్లకు అప్పుడే స్లిప్పుల పంపిణీ, వివరాల సేకరణ
  • పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న క్యాడర్
  • గులాబీ పార్టీ నేతల కనుసన్నల్లోనే ఓటర్ల వివరాలు

హైదరాబాద్,వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషనే రాలేదు. షెడ్యూల్ ఎప్పడొస్తుందో తెలియదు. కానీ.. బీఆర్ఎస్​ నేతలు మాత్రం ఇప్పటినుంచే ఓటర్లకు గాలం వేసే కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. తాజాగా ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడే.. ఎన్నికలు రాలేదు కదా..? అని ఓటర్లు ప్రశ్నిస్తే..‘వచ్చే ఎన్నికల్లో  మీరు మా పార్టీకే ఓటు వేయాలి’ .. అంటూ సమాధానమిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పాత.. కొత్త  ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. తమ పార్టీకే పడేలా ఓటు పడేలా అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్​ సిటీలోని 24 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సీట్లను గెలిచేందుకు బీఆర్ఎస్ అధిష్టానం​  కార్యాచరణ ప్రారంభించింది. కాంగ్రెస్​, బీజేపీ తదితర పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపిక  కసరత్తు చేస్తుండగా.. ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆఖరు నిమిషంలో అభ్యర్థుల మార్పులు, చేర్పులపై ఎలా ఉన్నా, అంతకంటే ముందుగా ఓటర్లను కారు పార్టీ నేతలు ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి

ఎలాగైనా ఈసారి పార్టీ అభ్యర్థులు గెలవాలనే ధీమాతో బీఆర్​ఎస్​నేతలు, కిందిస్థాయి కార్యకర్తలను రంగంలోకి దించారు. గెలుపు ఓటముల్లో ఓటర్లదే కీరోల్ కాబట్టి ముందుగా ఓటర్ల జాబితాపైనే దృష్టి పెడుతున్నారు. జాబితాలోని ఓటర్లు  చిరునామాల్లో ఉంటున్నారా? ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారా? ఎవరైనా చనిపోయారా? కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఎవరు? అంటూ ఆరా తీస్తున్నారు. మినీ ఎలక్ర్టానిక్​ప్రింటర్లతో  ఓటర్లకు అప్పటికప్పడు స్లిప్పులు అందిస్తున్నారు. ఇటీవలే ఎన్నికల కమిషన్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దీని ఆధారంగా బీఆర్ఎస్​ అభ్యర్థులు తమ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు.   రికార్డులో పేర్కొన్న చిరునామాలో ఉన్నారా? ఎవరైనా చనిపోయారా? ఎవరైనా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారా?  అన్న వివరాలను కూడా రికార్డు చేస్తున్నారు. పోలింగ్​బూత్​ల వారీగా నేతలు, కార్యకర్తలు వెళ్లి ఆరా తీస్తున్నారు. కొత్తగా ఓటు హక్కులోకి వచ్చే వారిని ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించే దళితబంధు, బీసీ బంధు, డబుల్​ బెడ్​రూడ్రూమ్ ఇండ్లు, పెన్షన్​లు తదితర స్కీముల్లో లబ్ధి పొందుతున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీకే ఓటువేసేలా కోరేందుకు ప్రతి ఓటరు ఫోన్​ నెంబర్లను కూడా సేకరిస్తున్నారు.

వలసపోయిన వారిని గుర్తిస్తూ..

బీఆర్ఎస్​ నేతలు తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఓటరు జాబితా సేకరిస్తున్నారు. ఇలా సనత్​నగర్​ స్థానంలో ఇప్పటికే ఓటర్ల జాబితాపై గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు కసరత్తు పూర్తి చేసినట్టు పార్టీ నియోజక వర్గ సీనియర్​నేత గుర్రం  పవన్​కుమార్​గౌడ్​ పేర్కొన్నారు. వేరే ప్రాంతాలకు వలసపోయిన వారిని గుర్తించి వివరాలను అధికారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. చనిపోయిన వారి వివరాలను కూడా అందజేస్తున్నట్టు చెప్పారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిని గుర్తించి ఫారం–6 అందించి  ఓటరుగా నమోదు చేయిస్తున్నామని వివరించారు. ఇలా సిటీలోని అన్ని నియోజకవర్గల్లో ఓటర్ల జాబితాల వెరిఫికేషన్​ పూర్తిచేసి అధికారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. అక్టోబరు 19న ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుందని ఆయన తెలిపారు.

మమ్మల్ని గెలిపిస్తే..

ఎన్నికలు సమీపిస్తుండగా సనత్​ నగర్​లో బీఆర్ఎస్​నేతలు ఆర్భాటంగా ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. ఆత్మీయ సమ్మేళనాలు, వార్డు కమిటీ మీటింగ్​లు, డబుల్​ బెడ్రూమ్‌ ల పంపిణీ లాంటి కార్యక్రమాల్లోనూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. పనిలో పనిగా ఓటరు స్లిప్పులతో పాటు పార్టీ అభ్యర్థుల కరపత్రాలను కూడా క్యాడర్‌‌తో పంపిణీ చేయిస్తున్నారు. ‘ మేం గెలిస్తే మీరు కోరుకున్నది చేస్తాం’అంటూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఇప్పటికే కొందరు క్యాండిడేట్లు మొదటి దశ ప్రచారం కూడా పూర్తి చేసుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడనేది, నోటిఫికేషన్​రాకపోయినా గ్రేటర్ సిటీలోని పలు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నేతలు, క్యాడర్ ప్రచార హడావిడిలో మునిగిపోయారు.