బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరించి ఓట్లడగండి : మంత్రి హరీశ్​ రావు

బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరించి ఓట్లడగండి : మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకు వివరించి ప్రేమతో ఓట్లడగాలని మంత్రి హరీశ్​ రావు కార్యకర్తలకు సూచించారు. మంగళవారం సిద్దిపేటలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి అంటేనే సిద్దిపేట అని, ప్రతిపక్షాలు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సిద్దిపేటలో మనకు ఏ పార్టీతో పోటీ లేదని మనకు మనమే మెజార్టీతో పోటీ పడదామన్నారు. సిద్దిపేట అభివృద్ధి ని చూసి అందరూ నేర్చుకునేలా చేశానని మనది కుటుంబ అనుబంధమని పేర్కొన్నారు. దుబ్బాకలో ప్రభాకరన్నకు అండగా ఉండి ఆయన  గెలుపు కోసం కష్టపడి పనిచేద్దామన్నారు.

సిద్దిపేట అభివృద్ధి అడ్డుకున్న వాళ్లకు ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదని, సీఎం కేసీఆర్​ పాలనలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదన్నారు. ఎన్నికలయ్యే వరకు సర్పంచులు, ఉప సర్పంచ్​లు, ఎంపీటీసీలు సిద్దిపేట పట్టణం వదిలి  గ్రామాల్లో  ప్రజల మధ్య ఉండి మనం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలని కోరారు. అనంతరం మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని సిద్దిపేట  పట్టణ శివార్లలో పోలీసులు తనిఖీ చేశారు. ఆయన పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం చెక్ చేశారు. 

ఆర్ అండ్ ఆర్ కాలనీ దేశానికే ఆదర్శం

గజ్వేల్:  కేసీఆర్ సీఎం అయ్యాక గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి జరగబోతుందని , సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే గా ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్గల్ మండలంలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్ లో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్వాసితులతో, పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ కాలనీ అంత గొప్పగా దేశంలో మరో కాలనీ నిర్మాణం జరగలేదన్నారు. కొంత మంది చెక్కుల విషయంలో సాంకేతిక ఇబ్బందుల వల్ల,  కొన్ని ప్లాట్లు కోర్టు కేసుల వల్ల రిజిస్ట్రేషన్ కాలేదని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ వచ్చే పరిస్థితి లేదని, వారిని నమ్ముకుంటే కుక్క తోకను పట్టుకొని గోదారి ఈదినట్టేనన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కేసీఆర్​ని గెలిపించి మూడోసారి సీఎం చేసుకుందామన్నారు.