
సిద్దిపేట, వెలుగు : బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర దక్కితే.. కాంగ్రెస్ హయాంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎకరానికి కేవలం ఆరు క్వింటాళ్ల కందులే కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతులు పండించిన జొన్నలు, కందులు, మక్కలు, సన్‌ఫ్లవర్‌ను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ రైతులను మోసం చేస్తుందే తప్ప.. అభివృద్ధి చేయడం లేదన్నారు. అనంతరం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో నిర్వహించిన మహిళా జాబ్‌మేళాను ప్రారంభించారు.
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని నమ్మితే ఎగవేతలేనని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలనే కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. సాయంత్రం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. అంతకు ముందు బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని కోరుతూ బీఆర్‌ఎస్ యువజన విభాగం రూపొందించిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సిద్దిపేట రూరల్, వెలుగు : వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అకాల వర్షం కారణంగా నారాయణరావు పేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుబంధును వెంటనే విడుదల చేయాలన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నారన్నారు. పంటలు ఎండల వల్ల కాకుండా కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా ఎండిపోతున్నాయన్నారు. అంతకుముందు తోర్నాల చౌరస్తాలో అమరుల స్తూపానికి, గ్రామ స్వాగత తోరణానికి భూమిపూజ చేశారు. అనంతరం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ ఇంద్రగూడెంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, శేరుపల్లి యాదగిరి పాల్గొన్నారు.