నీళ్లపై అసెంబ్లీలో చర్చిద్దాం ..సమావేశాలు ఏ తేదీలో పెడ్తవో పెట్టు.. వాయిదా వేసి పారిపోవద్దు: హరీశ్ రావు

నీళ్లపై అసెంబ్లీలో చర్చిద్దాం ..సమావేశాలు ఏ తేదీలో పెడ్తవో పెట్టు.. వాయిదా వేసి పారిపోవద్దు: హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: నీళ్లపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఏ తేదీలోనైనా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని, ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైనా చర్చిద్దామన్నారు. చర్చించేటప్పుడు అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోవద్దని ఎద్దేవా చేశారు. శుక్రవారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే భవన్‌‌‌‌‌‌‌‌లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్‌‌‌‌‌‌‌‌ను కలిసి బ్యారేజీలపై నాటి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అదనపు సమాచారాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో హరీశ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు.

 బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఆరుసార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయని, కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఆ బ్యారేజీలకు అసెంబ్లీలోనూ మూడుసార్లు ఆమోదం తెలిపామని గుర్తుచేశారు. వాటికి సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్‌‌‌‌‌‌‌‌కు సమర్పించామని వెల్లడించారు. 

ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదని, అది 50 ఏండ్ల కాంగ్రెస్ ద్రోహ చరిత్రకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని విమర్శించారు. ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలనలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి వంటి చేతగాని నాయకులు పెదవులు మూసుకోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. 

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి నాడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నివేదికలో గోదావరి కింద 968 టీఎంసీలు, కృష్ణా కింద 299 టీఎంసీలు కేటాయించారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన 42వ రోజునే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం నీళ్లను పున:పంపిణీ చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. దాని ఆధారంగానే ఇప్పుడు అధికారులు కృష్ణాలో 763 టీఎంసీల కోసం పోరాడుతున్నారని, కానీ, ఉత్తమ్ మాత్రం 575 టీఎంసీల కోసమే పోరాడుతున్నామంటూ చెప్పడం మంచిది కాదన్నారు.