- చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు
- బలవంతంగా తమను గుడి నుంచి బయటకు లాగేశారని ఆరోపణ
- ఆఫీసర్లు అడ్డుకోవడంతోనే ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడాల్సి వచ్చింది
- మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: భార్యాపిల్లలతో కలిసి తన సొంతూరులోని సమ్మక్క సారలమ్మ ఆలయ దర్శనానికి వెళ్తే.. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ నారాయణ తనపట్ల అనుచితంగా ప్రవర్తించి అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ అధికారులపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా అభ్యంతరకరంగా పోలీసులు వ్యవహరించారని, తమను గుడి నుంచి బలవంతంగా, అవమానకరంగా బయటకు లాగేశారని ఆరోపించారు. ప్రొటోకాల్‌ను పాటించలేదన్నారు. కారణం లేకుండానే తమను అడ్డుకున్నారన్నారు. ఈ చర్యలన్నీ తన గౌరవాన్ని భంగపరిచేవేనని.. కాబట్టి వారిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్‌ను కోరారు.
కావాలని అన్లే..
పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమని, వారిని ఉద్దేశపూర్వకంగా మాటలు అనలేదని కౌశిక్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారన్నారు. తాము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కొందరు అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారన్నారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారానే తప్ప కావాలని అన్న మాటలు కాదన్నారు. కానీ, కొందరు కావాలనే పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు.
