LasyaNanditha:అతిచిన్న వయసులో ఎమ్మెల్యేగా లాస్య నందిత

LasyaNanditha:అతిచిన్న వయసులో ఎమ్మెల్యేగా లాస్య నందిత

సికింద్రాబాద్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు లాస్య. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు.

కంటోన్మెంట్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించడంతో 2023, నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, గద్దర్ కూతురు వెన్నెలపై ఆమె గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో అతిచిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా లాస్య నందిత నిలిచారు. 

అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల్లోపే అమె చనిపోయారు. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు దగ్గర ORR పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో సాయన్న కటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సాయన్న మరణించడం.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కూతురు లాస్య నందిత కూడా చిన్న వయసులోనే మృతి చెందడం అందరినీ బాధకు గురిచేస్తోంది. ఆమె మృతిపట్ల రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..  ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ఆకాంక్షిస్తున్నారు.