కాంగ్రెస్లో చేరలేదంటూ నిస్సిగ్గుగా చెప్తున్నరు : ఎమ్మెల్యే పల్లా విమర్శలు

కాంగ్రెస్లో చేరలేదంటూ నిస్సిగ్గుగా చెప్తున్నరు : ఎమ్మెల్యే పల్లా విమర్శలు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా విమర్శలు

హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వచ్చిన అడ్వకేట్ లు తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్​ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. అసంబద్ధమైన ప్రశ్నలు వేసినా ఓపికతో సమాధానం చెప్పామని తెలిపారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరలేదంటూ నిస్సిగ్గుగా చెప్తున్నారని, పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్​ విచారించగా.. బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్​లు తమ వాదనలు వినిపించారు. తొలిరోజు విచారణ అనంతరం అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. 

పది మంది బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరిన విషయం బహిరంగ రహస్యమని పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. తమ ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్​కు వివరణ ఇచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్​ విచారణ చేపట్టారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్​కు స్పష్టం చేశామని వెల్లడించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలన్నారు. కాగా, వాళ్లు పార్టీ మారారని రుజువు చేయడానికి అవసరమైన అన్ని ఆధారాలనూ స్పీకర్​కు అందించామని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​ అన్నారు.