గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఆగం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఆగం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
  •      అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఫైర్
  •      కేంద్రం ఇచ్చిన 1300 కోట్లలో  రాష్ట్ర వాటా ఎక్కడని నిలదీత 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. రెండేండ్లలో పల్లెల్లో ఒక్క కొత్త రోడ్డు వేయలేదని, పారిశుధ్యం పడకేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పార్టీలకతీతంగా సర్పంచులకు నిధులిచ్చి ఊర్లను బాగు చేస్తే.. ఇప్పుడు నిధుల్లేక సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు అప్పులు తెచ్చి పనులు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. గురువారం ఆమె అసెంబ్లీలో పంచాయతీరాజ్ శాఖపై జరిగిన చర్చలో మాట్లాడారు. 

గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ నిర్వీర్యమైందని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తండాలకు మంజూరైన బీటీ రోడ్లను క్యాన్సిల్ చేసి, ఆ నిధులను మంత్రుల నియోజకవర్గాలకే మళ్లించుకోవడం ఏంటని? ప్రశ్నించారు. అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, మెనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వారికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో హరితహారం వల్ల రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని, హైదరాబాద్‌‌‌‌ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. 

కేంద్రం సర్పంచుల కోసం రూ. 1300 కోట్ల నిధులు ఇచ్చినా.. దానికి సమానమైన రాష్ట్ర వాటా నిధులను సర్కారు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.మిషన్ భగీరథ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. కేసీఆర్ పుణ్యమా అని ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తుంటే.. ఇప్పుడు మెయింటెనెన్స్ నిధులు ఇవ్వకపోవడంతో పైపులు లీకవుతున్నాయని, సిబ్బందికి జీతాల్లేక ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

మంత్రి పొన్నం వర్సెస్ సునీత

సునీత మాట్లాడుతుండగా మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుంటూ.. ‘మీరు 2009–14 మధ్య కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నప్పుడు నర్సాపూర్ లో నల్లా నీళ్లు రాలేదా?’ అని ప్రశ్నించారు. దీనికి సునీతా లక్ష్మారెడ్డి బదులిస్తూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఊర్లకే నల్లాలు ఉండేవి. కానీ కేసీఆర్ ప్రతి ఇంటికీ నీళ్లివ్వాలన్న లక్ష్యంతో భగీరథ తెచ్చారని చెప్పారు. 

నాడు ఎండాకాలంలో బిందెలతో క్యూ కట్టే పరిస్థితి ఉండేది.. దాన్ని కేసీఆర్ మార్చారని పేర్కొన్నారు. తన నియోజకవర్గం నర్సాపూర్ లో కేసీఆర్ రూ. 40 కోట్లు రోడ్లకు కేటాయిస్తే.. రూ. 15 కోట్లు ఖర్చయ్యాయని, మిగిలిన రూ. 25 కోట్లు వెంటనే విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.