బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  •     బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్​
  •     గన్​పార్క్​ వద్ద నిరసన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్​చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం బీసీలను దగా చేస్తున్నదని మండిపడ్డారు. బీసీ సబ్​ప్లాన్​అమలు చేయాలని కోరుతూ గురువారం గన్​పార్క్​ వద్ద బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్​లీడర్లు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్​నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. గొల్ల, కురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని వారు డిమాండ్​చేశారు.  

కొత్తగా ఏం చేయలే: హరీశ్ రావు

ఆరోగ్య శ్రీ కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని హరీశ్​రావు విమర్శించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్​చాట్​చేశారు. 2014 జూన్ రెండో తేదీ వరకు ఆరోగ్యశ్రీకి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అయ్యేవని, 2023 నాటికి అది రూ.68 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. 

ఇప్పుడు అది రూ.89 కోట్లు అంటున్నారని, అందులో సహజ పెరుగదల ఉంది.. తప్పితే కొత్తగా చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని ఆరోపించారు.