
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి తీహార్జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్, సీబీఐ విచారణకు ట్రయల్ కోర్టు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ఈ నెల 27, 28 తేదీల్లో విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్ 1 నుంచి 29 వరకు ఢిల్లీ హైకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో.. అంతకన్నా ముందే మే 30, 31 తేదీల్లో తీర్పు వెలువరించే ప్రయత్నం చేస్తామని జడ్జి తెలిపారు.
కానీ, ఆ తేదీల్లో తీర్పును వెలువరించలేదు. కవిత పిటిషన్లపై ఆమె అడ్వకేట్ మోహిత్ రావు కోర్టులో మెన్షన్ చేయగా.. ఆ పిటిషన్లు లిస్ట్ కాలేదని రిజిస్ట్రార్ తెలిపారు. దీంతో ఆమె బెయిల్ పిటిషన్లపై తీర్పు వేసవి సెలవుల తర్వాతే వెలువడే అవకాశం ఉందని లీగల్ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జూన్ 30న ఆదివారం కావడంతో కవిత బెయిల్ పిటిషన్లపై జులై మొదటి వారంలోనే తీర్పు వచ్చే ఆస్కారం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. ఇదిలా ఉంటే, జూన్ 3న కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె కస్టడీని పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే ఆస్కారం ఉంది. మరో వైపు కవితపై దాఖలు చేసిన చార్జ్ షీట్, జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో అదే రోజు విచారణ జరగనుంది.