ముగిసిన కవిత విచారణ..16న మళ్లీ రావాలన్న ఈడీ

ముగిసిన కవిత విచారణ..16న మళ్లీ రావాలన్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 2023, మార్చి 11వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో.. ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు.  ఉదయం 11 గంటలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. రాత్రి  ఎనిమిది గంటల వరకు ప్రశ్నించారు అధికారులు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆప్ పార్టీకి ఇచ్చినట్లు సిసోడియా, పిళ్లయ్, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు. 

కేసులో విచారణ ఇంకా ముగియలేదని.. మార్చి 16వ తేదీన కవితను మళ్లీ విచారించనున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేటమేంట్ రికార్డ్ చేశారు అధికారులు. విచారణ సందర్భంగా లిక్కర్ స్కాం గురించి నాకేం తెలియదని.. నేను కుట్రదారుని కాదు అని స్పష్టం చేశారామె. ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదంటూ ఈడీ ప్రశ్నలకు సమాదానం ఇచ్చారు కవిత. ఆమెను  ప్రశ్నించే సమయంలో.. అరుణ్ పిళ్లయ్ కూడా అక్కడే ఉన్నారు. గత విచారణలో కవిత బినామీ అంటూ ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా.. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు అధికారులు. ఆ తర్వాత తన స్టేట్ మెంట్ ఉప సంహరించుకుంటున్నట్లు పిళ్లయ్ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడు. ఆయన సమక్షంలోనే కవితను ఇంటరాగేషన్ చేయటం విశేషం.