ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు

ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు మేకా శరణ్ ఇండో స్పిరిట్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారని, ఆయన అక్కడ  పనిచేయకున్నా నెలకు రూ. లక్ష జీతం తీసుకుంటున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణకు పిలిస్తే హాజరు కాలేదని, అప్రూవర్ గా మారిన వారిని బెదిరించి వాంగ్మూలాలను వెనక్కి తీసుకునేలా చేస్తున్నారని ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోర్టులో వాదనలు వినిపించారు.  లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మూడో రోజు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగాయి.

 లిక్కర్ పాలసీ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని చెప్పారు. 338 కోట్ల రూపాయలు హోల్ సెల్ వ్యాపారంలో సంపాదించారన్నారు. కమీషన్ ను 5 నుంచి 12 శాతానికి పెంచారని వివరించారు. దీంతో ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ పాలసీరూపకల్పనలో ఇండో స్పిరిట్ సంస్త మేజర్ గా లాభపడిందని చెప్పారు.  విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై వ్యవహారాన్ని నడిపారని వివరించారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని, పాలసీ మార్పుతో అసాధారణ లాభాలు పొందారని జోహెబ్ హుస్సేన్ కోర్టుకు విన్నవించారు. 

ఇండో స్పిరిట్స్ కంపెనీ  192 కోట్లు లాభం పొందిందన్నారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్స్ మేజర్ హోల్ సెల్లర్ గా ఉందని, ఈ కంపెనీలో కవిత భాగస్వామిగా ఉందని కోర్టుకు తెలిపారు.  కవితను కలవాలని కేజ్రీవాల్ చెప్పినట్లు మాగుంట రాఘవ స్టేట్మెంట్ ఇచ్చారని వివరించారు. లిక్కర్ వ్యాపారం లో భాగస్వామ్యం కోసం సౌత్ గ్రూప్ 100 కోట్లు విజయ్ నాయర్ ద్వారా ఆప్ కి చెల్లించిందని చెప్పారు. ఇందుకు సంబంధించి కవిత చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు కు చెందిన వాట్సాప్ చాట్ ను ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. విత తరపున బుచ్చిబాబు లైజెనింగ్ చేశారని కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవ ల వాట్సప్ చాట్స్ లో సాక్ష్యాధారాలు దొరికాయని, మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి సాక్ష్యాలను ధ్రువీకరించారని చెప్పారు. లిక్కర్ వ్యాపారంలో కవితకు 33 శాతం వాటకోసం బుచ్చిబాబు పనిచేశారన్నారు. 

ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భగస్వామ్యం పొందారని మాగుంట రాఘవ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు. కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేశారని,  ఎందుకు డిలీట్ చేశారని అడిగితే కవిత సమాధానం చెప్పలేదని కోర్టుకు వివరించారు. మార్చి 14, 15 తేదీల్లో కవిత తన నాలుగు ఫోన్లు ఫార్మాట్ చేశారన్నారు. ఫోన్లు ఇవ్వాలని కోరిన తర్వాతే నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేశారని చెప్పారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను బెదిరించారని వివరించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు తీర్పును మే 6వ తేదీకి రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా రిజాయిండర్ వాదనలు ఎల్లుండి లిఖితపూర్వకంగా ఇస్తామని కవిత తరపు న్యాయవాది నితీశ్​ రాణా  కోర్టుకు తెలిపారు.