మాజీ CM యడియూరప్పకు బిగ్ షాక్: పోక్సో కేసు కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరణ

మాజీ CM యడియూరప్పకు బిగ్ షాక్: పోక్సో కేసు కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరణ

బెంగుళూర్: బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్పకు కర్నాటక హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన పోక్సో కేసు కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. అవసరమైనప్పుడు మాత్రమే యడియూరప్ప వ్యక్తిగత హాజరును ట్రయల్ కోర్టు కోరాలని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన ఏదైనా దరఖాస్తును సక్రమంగా పరిశీలించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది హైకోర్టు.

తన మైనర్ కూతురిని యడియూరప్ప లైంగికంగా వేధించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు 2024 మార్చి 14న పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కర్నాటక ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ జారీ చేసిన సమన్లను ఆయన ట్రయల్ కోర్టులో ఛాలెంజ్ చేశారు.

►ALSO READ | ఆఫీసుల్లో పెరుగుతున్న రొమాన్స్ ధోరణి.. ప్రపంచంలో 2వ స్థానంలో భారత్..!

యడియూరప్ప పిటిషన్‎ను తిరస్కరించిన ట్రయల్ కోర్టు.. సీఐడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి తనపై నమోదైన పోక్సో కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

యడియూరప్ప అభ్యర్థనతో ఏకీభవించని హైకోర్టు ఆయన పిటిషన్‎ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. అయితే.. అవసరమైనప్పుడు మాత్రమే యడియూరప్ప వ్యక్తిగత హాజరును ట్రయల్ కోర్టు కోరాలని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన ఏదైనా దరఖాస్తును సక్రమంగా పరిశీలించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది హైకోర్టు.