గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు

గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు

గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్‭లో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. బడ్జెట్‭కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కే కేశవరావు ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ కోసం కోర్టు సహాయం కోరాల్సి వస్తోందని.. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ రాలేదని చెప్పారు. తెలంగాణతో పాటు ఢిల్లీ, తమిళనాడు, కేరళ అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ గురించి ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు. సమాఖ్య వ్యవస్థ, ఫెడరలిజం గురించి చర్చ జరగాలని కేశవరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదని దాని గురించి రాష్ట్ర ప్రభుత్వంతో అభ్యంతరాలు ఉంటే కూర్చుని మాట్లాడాలని అన్నారు. ఇక రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ పై నిర్ణయం తీసుకున్నాక వెల్లడిస్తామని కే కేశవరావు స్పష్టం చేశారు. 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలు లేవనెత్తుతామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. రైతుల పంటలకు మద్దతు ధర రెట్టింపు చేయలేదని.. నిరుద్యోగం అంశంపైనా చర్చకు తాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. కేవలం బిల్లులకు ఆమోదం తెలిపేందుకే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం కాదని.. ప్రజా సమస్యలపైనా చర్చలు జరపాలని నామా డిమాండ్ చేశారు.