V6 వెలుగుపై దుష్ప్రచారం .. హైడ్రా కేసుతో ఎలాంటి సంబంధం లేదు

V6 వెలుగుపై దుష్ప్రచారం .. హైడ్రా  కేసుతో ఎలాంటి సంబంధం లేదు
  • తమ కేసుతో ‘వీ6 వెలుగు’కు ఎలాంటి సంబంధం లేదన్న హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ కేసుకు సంబంధించి హైడ్రా ఇచ్చిన ప్రకటనలో ఉన్న ‘వెలుగు’ అనే పదాన్ని పట్టుకొని ‘వీ6 వెలుగు’పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్​కు చెందిన ఓ వర్గం విషప్రచారం చేస్తోంది. నిజానికి హైడ్రా చెప్పిన ‘వెలుగు’కు ‘వీ6 వెలుగు’కు ఎలాంటి సంబంధం లేదు. 

జీహెచ్​ఎంసీ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన మంఖాల్ గ్రామంలో ‘వ‌‌‌‌ర్టెక్స్ రియ‌‌‌‌ల్ ఎస్టేట్’ అనే సంస్థ లే ఔట్ వేసింది. ఈ క్రమంలో అక్కడి సూరం చెరువును ఆక్రమించినట్టు ఫిర్యాదు అందడంతో హైడ్రా కేసు నమోదుచేసింది. సదరు వర్టెక్స్​వెంచర్​లో తన స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేశారంటూ చైతన్యారెడ్డి అనే వ్యక్తి సైతం ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు విచారణ ప్రారంభించారు. 

హైడ్రా అధికారులతో మాట్లాడి రోడ్డును తొలగిస్తామంటూ ఇద్దరు యూట్యూబ్​చానల్​ రిపోర్టర్లతో పాటు ఓ లీగల్ అడ్వయిజర్ కలిసి తన వద్ద రూ.50 లక్షలు తీసుకున్నారని చైతన్యారెడ్డి చెప్పారు. దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన హైడ్రా అధికారులు గత గురువారం మీడియాకు ప్రెస్​నోట్​విడుదల చేశారు. 

సదరు యూట్యూబ్​చానల్​పేరులోనూ ‘వెలుగు’ అనే పదం ఉండడంతో హైడ్రా అధికారులు అత్యుత్సాహంతో ‘వెలుగు’లోకి వచ్చిన రిపోర్టర్ల దందా.. అనే హెడ్​లైన్​తో ఇచ్చిన ఆ ప్రెస్​ నోట్​ను పలు పత్రికలు ప్రచురించాయి.  సోషల్​మీడియా చానళ్లు సైతం ప్రసారం చేశాయి. 

దీంతో వీ6 వెలుగు ప్రతినిధులే ఈ దందాకు పాల్పడుతున్నారనే అర్థం వచ్చేలా బీఆర్ఎస్​కు చెందిన గ్రూపులు సోషల్​ మీడియాలో ట్రోల్ ​చేస్తున్నాయి.  దీనిపై హైడ్రా చీఫ్​ రంగనాథ్​ను వివరణ కోరగా.. తమ పొరపాటుకు చింతిస్తున్నామని, తాము కేసుపెట్టిన యూట్యూబ్​ చానల్​ రిపోర్టర్లతో  ‘వీ6 వెలుగు’కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రూ.50 లక్షల  వ్యవహారానికి సంబంధించిన అంశంపై విచారణ కొనసాగుతోందని వివరించారు.  రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన వెల్లడించారు.