గులాబీ సెంటిమెంట్.. డిసెంబర్ కలిసొస్తుందని ప్రచారం

గులాబీ సెంటిమెంట్..   డిసెంబర్ కలిసొస్తుందని ప్రచారం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన సెంటిమెంట్ ను ఎప్పటిలాగే ఇప్పుడూ పాటించనున్నారు. ఆయనకు ముఖ్యంగా అచ్చొచ్చిన సంఖ్య ఆరు. కేసీఆరే కాదు, ఫ్యామిలీ మెంబర్లతో పాటు పార్టీ నాయకులు కూడా ఆరు అంకెకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ వాహనాలకు ఆరు సంఖ్య వచ్చే నంబర్ ను ఏరి కోరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఆరు ఇప్పుడు తెలంగాణలో లక్కీనంబర్ గా మారింది. తెలంగాణలోని జిల్లాల సంఖ్య కూడా 33 అంటే కలిపితే ఆరు వచ్చేలా ఏర్పాటు చేశారన్న ప్రచారం ఇప్పటికీ ఉంది. సెక్రటేరియట్ లోనూ సీఎం కేసీఆర్ ఎంచుకున్నది ఆరో అంతస్తు కావడం గమనార్హం. 

ఒక్కటేమిటి అంతా ఆరు మయమే. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. దీనిని కూడా మంత్రి కేటీఆర్ ఆరుకు ముడిపెట్టేశారు. పోలింగ్ తేదీ నవంబర్ 30.. అలాగే కౌంటింగ్ తేదీ కూడా డిసెంబర్ 3వ తేదీ.. పోలింగ్ తేదీ, కౌంటింగ్ డేట్ రెండూ కలిపితే ఆరు అంకె వస్తుంది.. అది సీఎం కేసీఆర్ లక్కీ నంబర్.. ఈ ఎన్నికల్లో గెలిచేది తామేనని చెప్పారు. సీఎం కేసీఆర్ దక్షిణాదిలో హ్యాట్రిక్ కొట్టిన తొలిసీఎం గా చరిత్రను తిరగరాయబోతున్నారన్నారు. 

డిసెంబర్ కూడా అచ్చొస్తుందట

డిసెంబర్ నెల గులాబీ పార్టీకి బాగా కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జలదృశ్యంలో 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానంలో కీలకమైన ప్రకటన వెలువడింది డిసెంబర్ నెలలోనే అంటున్నారు. 14 ఎఫ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిరాహార దీక్షకు ఉపక్రమించడం, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటంతోనే 2009లో డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తొలి ప్రకటన వెలువడిందంటున్నారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరిగాయని, 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగగా.. టీఆర్ఎస్ అఖండ విజయాన్ని సొంతం చేసుకుందని, ఈ సారి కౌంటింగ్ డిసెంబర్ లో జరగనున్నందున బాగా కలిసి వస్తుందని గులాబీ పార్టీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

బీఫారాలు.. నామినేషన్


కేసీఆర్ తన లక్కీ నంబర్ కలిసొచ్చేలా ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు పంపిణీ చేయనున్నారు .15 వ తేదీ అంటే రెండంకెలు కలిపితే ఆరొస్తుంది. అందుకే ఆ తేదీన బీఫారాలు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

కోనాయిపల్లి వెంకన్న గుడిలో పూజలు

ఎన్నికలొచ్చిన ప్రతిసారీ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వేంకటేశ్వరస్వామి పాదాల చెంత నామినేషన్‌ పత్రాలు ఉంచి పూజలు చేయించడం కేసీఆర్ దశాబ్దాలుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్.. ఇప్పుడూ దానినే ఫాలో అవబోతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే గుడికి వచ్చి పూజలు చేస్తానని 1985లో కేసీఆర్‌ మొక్కిన మొక్కు నెరవేరడంతో సుదీర్ఘ కాలంగా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. అప్పటి నుంచి ఏ కొత్త పని ప్రారంభించినా ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. 1985 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో నామినేష్‌ పత్రాలకు ఆలయంలో పూజలు చేయించి దాఖలు చేస్తూ గెలుపొందారు. 

2001లో ఇదే ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. 2004లో కేసీఆర్‌ సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందు కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్‌ పత్రాలపై అక్కడే సంతకం చేశారు. రెండింటిలో భారీ మెజారిటీ సాధించగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే 2009లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా, 2014, 2018లలో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసే ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలోనే ప్రత్యేక పూజలు చేశారు.

ALSO READ : అమర్త్యసేన్ బతికే ఉన్నారు : కూతురు క్లారిటీ