లెటర్​ టు ఎడిటర్​ .. ‘గులాబీ’ మనుగడ ప్రశ్నార్థకం!?

లెటర్​ టు ఎడిటర్​ .. ‘గులాబీ’ మనుగడ ప్రశ్నార్థకం!?

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అప్పుడే రాష్ట్రంలో స్వపరిపాలన మొదలైందని నాటి సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని, తెలంగాణ డెవలప్‌‌మెంట్‌‌పైనే ఫోకస్ ఉంటుందని పేర్కొన్నారు. కొత్త కుండల ఈగ సొచ్చినట్టు సంసారం చక్కబెట్టుకొని ముందుకు సాగుతున్నట్టు తొలుత చెప్పారు. కానీ, కొద్ది రోజులకే స్వరం మారింది. ఊహించని స్థాయిలో ఇతర పార్టీల నుంచి నేతల చేరికల పర్వం కొనసాగింది. ఉద్యమకారులు అనే వారు అసలు దరిదాపుల్లో కనబడకుండా పోయారు. అయినప్పటికీ టీఆర్ఎస్‌‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా అభివర్ణించిన కేటీఆర్  ఇప్పుడు బీఆర్ఎస్‌‌‌‌కు అబ్రివేషన్ ఏం చెప్తారనేది ప్రశ్నగానే మిగిలింది. ‘గులాములం కాదు..ఆత్మగౌరవ గులాబీలం’ అంటూ కొంగరకలాన్ వేదికగా 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించిన కేసీఆర్.. చంద్రబాబు కూటమిని విలన్‌‌గా చూపి విజయపతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత ఐదేండ్ల కాలం గిర్రున తిరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు చెప్పినా గెలుపు గురి తప్పి..ఓటమి చవి చూడవలసి వచ్చింది.

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో

నైనా మార్పు తెచ్చుకోలేదు. ఓటమికి ప్రజలే కారణమంటూ వారిని తప్పుపట్టారు. 2024 పార్లమెంటు ఎలక్షన్స్ ప్రచారంలో సైతం ‘నరం లేని నాలుక నాలుగు దిక్కుల ఆడుతది’ అన్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేశారు. . కానీ, జూన్ 4న వచ్చిన ఫలితాల్లో బీఆర్ఎస్ ఖాతా  తెరవలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల వరకూ బీఆర్ఎస్‌‌కు సంధికాలమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్‌‌కు జరిగిన ఓటింగ్ పైన తీవ్రమైన ప్రభావం చూపాయి. దానికి తోడు ‘పాలిచ్చే బర్రెని ఇడిసిపెట్టి దున్నపోతును గెలిపించార’ని ప్రజలను తప్పుపట్టడం జనంలో చర్చగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్​ సాధించడం కోసం ఎంతటి దారుణమైన టెలిఫోన్ ట్యాపింగ్‌‌కు ఒడిగట్టారనేది జనంలోకి వెళ్లింది. ఎన్నికల్లో గెలుపునకు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నింటినీ ప్రదర్శించడం, పార్టీ అధినేత నిర్ణయాలు, వ్యవహార శైలి ప్రజల్లో ఆయన ప్రతిష్టను మరింతగా  మసకబార్చాయి.
- అంబీర్ శ్రీకాంత్