ఫోన్​లో వాదులాడుకున్న బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు

ఫోన్​లో వాదులాడుకున్న బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు

సోషల్ ​మీడియాలో వైరలవుతున్న ఆడియో

నాగర్ కర్నూల్,​ వెలుగు : నాగర్​కర్నూల్ ​జడ్పీ చైర్మన్​ఎన్నిక నాటి నుంచి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్​ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మధ్య అగాధం పెరిగిపోతోంది. శివరాత్రి సందర్భంగా అచ్చంపేటలో ఎంపీ రాములు, ఆయన కొడుకు భరత్​ ప్రసాద్​ పేర్లతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా  ఇద్దరి మధ్య జరిగిన ఓ ఆడియో సంభాషణ చర్చకు దారి తీసింది. అందులో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల వాదులాడుకున్నారు. ఒకానొక దశలో వార్నింగ్​లు ఇచ్చుకునే వరకు వెళ్లారు.  

ఆడియోలో ఏముందంటే..

ఎంపీ రాములుతో ఆయన పాల్గొన్న ఫంక్షన్​ గురించి మాట్లాడిన ఎమ్మెల్యే గువ్వల తర్వాత ​‘ఎలక్షన్​కు ఆరునెలల ముందు వచ్చి ఎమ్మెల్యే అయితా, ఫ్లెక్సీలు కట్టుకుంటా అంటే కుదరదు. మీవి అయితే ఓకే మీ కొడుకువి కడతా అంటే ఒప్పుకోను’ అని అన్నారు. ‘అందరికి స్వేచ్చ ఉంటుంది’ అని ఎంపీ రాములు అంటే ‘ఈపార్టీలో అట్ల ఉండదు. నాకున్న అధికారాలు ఉపయోగించుకుంటా’ అని గువ్వల బదులిచ్చారు. ‘చేసిందంతా చేసి ఇప్పడు సంబంధం లేదన్నట్లు మాట్లాడితే సరిపోదు’ అని రాములు అంటే ‘జరిగిన  దానితో నాకు సంబంధం ఉంటే భవిష్యత్​లో కూడా ఇట్లాగే చేస్తా’ అని గువ్వల అన్నారు. ‘సరే చేసుకోవయ్యా’ అని రాములు అనగానే గువ్వల సీరియస్ అయ్యారు. ‘వయ్యా  గియ్యా అని మాట్లాడకు. మంచిగామాట్లాడు, నేను సార్ అంటే నువ్వు అటెండర్లు మాట్లాడినట్లు మాట్లాడుతున్నవు’ అంటూ ఫైర్​అయ్యారు. ‘నీ కొడుకు కట్టిన ఫ్లెక్సీలు రేపటి వరకు తీసెయ్యాలె’ అని వార్నింగ్ ఇచ్చారు. ‘నీ బెదిరింపులు నాదగ్గర పనికిరావు’ అని రాములు అంటే ‘రికార్డ్‌ చేసుకుని పోయి ఎవరికైనాచెప్పుకో’ అని గువ్వల అన్నారు. ‘నీ కొడుకు అతి చేస్తే మర్యాదగా ఉండదు’ అని అన్నారు. పార్లమెంట్ మెంబర్ కొడుకని రాములు అంటే ‘నీ ఇంట్లో  పెట్టుకో’ అని గువ్వల బదులిచ్చారు. ‘మీరు ఎమ్మెల్యే అయితా అన్నా... మీ కొడుకు ఎమ్మెల్యే అయితా అన్నా వేరే పరిణామాలకు దారితీస్తుంది’ అని అన్నారు.  తన కొడుకును రెండు సార్లు జడ్పీ చైర్మన్​కాకుండా అడ్డుకున్నారని రాములు అనగా, జడ్పీ చైర్మన్ ఎంపిక తన చేతిలో ఏమీ లేదని బాలరాజు అన్నారు. పార్టీలో మాట్లాడిన తర్వాత ఏ సంగతి చెప్తా అని రాముల కాల్ కట్ చేశారు.