
హైదరాబాద్ వెలుగు : గ్రేటర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్లు దక్కాయి. గులాబీ అధిష్టానం సిట్టింగ్ లకే మళ్లీ కన్ఫర్మ్ చేసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 29 అసెంబ్లీ స్థానాల్లో పలుచోట్ల ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పోటాపోటీగా సొంత ప్రచారం చేసుకున్నా భంగపాటే ఎదురైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సోమవారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఉప్పల్ సెగ్మెంట్ మినహా అన్నిస్థానాల్లో సిట్టింగ్ లనే ఫైనల్ చేశారు.
నాంపల్లి, గోషామహల్ పెండింగ్ పెట్టారు. కంటోన్మెంట్ లో దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు చాన్స్ ఇచ్చారు. ఉప్పల్ లో బండారు లక్ష్మారెడ్డికి కేటాయించారు. ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డికి మరోసారి దక్కలేదు. మొన్నటి వరకు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఎమ్మెల్సీ కవితను సైతం కలిశారు.
ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారు. బల్దియా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి భర్త టీటీయూసీ కార్మిక విభాగ వ్యవస్థాక అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి కూడా ఆశించారు. ఈ ముగ్గురూ కొంతకాలంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ తో ఉప్పల్ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయినా.. చివరకు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. గోషామహల్, నాంపల్లిలో టికెట్ ఆశించే వారు ఎక్కువగా ఉండగా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. గోషామహల్ లో స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్ ఉంది.
గతంలో ఇక్కడ నుంచి ఉత్తర భారత్ నేతలకు ఇచ్చారు. ఈసారి స్థానికులైన మాజీ కార్పొరేటర్ మమత గుప్తాతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆర్వీ మహేందర్ కుమార్, నంద కిషోర్ వ్యాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఎంఐఎం ఖాతాలోని నాంపల్లిలోనూ ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్నారు. మొత్తానికి అధికార పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా కోసం టికెట్ ఆశించిన నేతలతో పాటు అన్నిపార్టీల లీడర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
కేటీఆర్ ఆశీస్సులు ఉన్నాయని..
శేరిలింగంపల్లి నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ టికెట్ ఆశించారు. 2009 లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. టికెట్ తనకే వస్తుందని, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు ఉన్నాయని పార్టీ ఆఫీస్ సైతం తెరిచారు. నిత్యం విస్తృతంగా పర్యటిస్తూ నేతలు, కార్యకర్తలను కలుస్తూ అన్నిఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోసారి ప్రస్తుత ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి టికెట్ ఇచ్చారు.
తనకే వస్తుందని చెప్పుకున్నా..
సికింద్రాబాద్, కంటోన్మెంట్ స్థానాల్లో టికెట్ ఆశించిన ఆశావహులు తీవ్ర నిరాశలో పడిపోయారు. మోతె శోభన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి కూడా ప్రయత్నించారు. తీరా టికెట్ ఎమ్మెల్యే పద్మారావుకు దక్కింది. కంటోన్మెంట్ నుంచి దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందితకు అవకాశం కల్పించారు. దీంతో మన్నె క్రిషాంక్, గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీగణేశ్ అసంతృప్తికి లోనయ్యారు. గతేడాది నుంచి శ్రీగణేశ్తనకు టికెట్వస్తుందని చెప్పుకుంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చివరకు టికెట్ ఇవ్వకపోగా ఇండిపెండెంట్ గా దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
వీడిన ఉత్కంఠ
కుత్బుల్లాపూర్ టికెట్ పై ఉత్కంఠ వీడింది. ప్రస్తుత ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మధ్య టికెట్ పై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇద్దరూ పోటాపోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకదశలో శంభీపూర్ రాజుకు ఖాయమనే చర్చ జోరుగా సాగింది. మరోసారి వివేకానందకే టికెట్ కేటాయించగా శంభీపూర్ రాజు వర్గీయులు తీవ్ర నిరాశలో పడిపోయారు.
తిరిగి గులాబీ గూటికి చేరినా..
ఖైరతాబాద్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది. మంత్రి కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే ఆయన 2014లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించగా.. దానం నాగేందర్ పార్టీలో చేరడంతో ఆయనకు ఇచ్చారు. అప్పట్లో గోవర్దన్ రెడ్డి వర్గీయులు ఆందోళనలకు సైతం దిగారు. బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ గులాబీ గూటికి చేరారు. ఈసారి కూడా టికెట్ వస్తుందనుకున్నా నిరాశ తప్పలేదు. గోవర్దన్ రెడ్డి భార్య ప్రస్తుతం వెంకటేశ్వర్ నగర్ కాలనీ కార్పొరేటర్ గా ఉన్నారు.
నువ్వా నేనా అన్నట్టుగా..
పటాన్ చెరువు ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు చిట్కూల్ సర్పంచ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీరు పోటాపోటీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌తో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫ్లెక్సీలతో చేసుకునే ప్రచారం పటాన్ చెరువులోనే అని చెప్పొచ్చు. పార్టీ, పండుగ ఏ సందర్భమైనా నువ్వా నేనా అన్నట్లు చేసుకుంటున్నారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మద్దతుతో తనకే టికెట్ వస్తుందని మధు భావించినా చివరకు నిరాశ ఎదురైంది.
రెండుసార్లు పోటీలోకి దిగినా..
ఎల్బీ నగర్ నుంచి 2014, 2018లో బీఆర్ఎస్ ఇన్ చార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ పోటీచేసి ఓడిపోయారు. ఈసారి కూడా టికెట్ లభించలేదు. తనకే వస్తుందని ఆశించినా కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి మళ్లీ కట్టబెట్టారు. తనకు మొదటి నుంచి శత్రువుగా ఉన్న సుధీర్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించడంపై తీవ్ర నిరాశలో రామ్మోహన్ గౌడ్ ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్‌పై అనుచరులతో చర్చిస్తున్నారు.
టికెట్ ఇస్తారని ఎదురుచూసినా..
మహేశ్వరం నుంచి టికెట్ ఆశించిన తీగల కృష్ణారెడ్డికి నిరాశే ఎదురైంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితారెడ్డి చేతిలో ఓటమి చెందారు. అనంతరం సబితారెడ్డి బీఆర్ ఎస్ లో చేరడమే కాకుండా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అప్పటి నుంచి తీగల అసంతృప్తితోనే ఉంటున్నారు. ఆయనను బుజ్జగించేందుకు తన కోడలు తీగల అనితారెడ్డిని రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ గా చేశారు. అయినా తీగల తనకు అధిష్టానం మరోసారి చాన్స్ ఇస్తుందని ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. ఇటీవల తీగల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే వార్తలు వచ్చినా సబితారెడ్డి.. ఆయన ఏడమొహం పెడమొహంగానే ఉన్నారు.
తన కొడుక్కి ఇవ్వాలని కోరినా..
ముషీరాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు మరో ఇద్దరు టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎంఎన్ శ్రీనివాస్ తో పాటు నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఎప్పటి నుంచో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఆరోగ్యం సహకరించడంలేదని తన కొడుకు జై సింహకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. చివరకు ఎమ్మెల్యే గోపాల్ కే కేసీఆర్ టికెట్ కేటాయించారు.
వికారాబాద్ జిల్లాలోనూ సిట్టింగులకే..
వికారాబాద్ : జిల్లాలో బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ సిట్టింగ్ లకే చాన్స్ ఇచ్చింది. వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. మరోసారి ఆపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బరిలో నిలిచి తమ భవితవ్యాన్ని పరీక్షించుకునే అవకాశం దక్కింది. దీంతో జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. సిట్టింగ్ లకు మరోసారి టికెట్ల కేటాయింపుతో ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు ఎమ్మెల్యేలను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు.