టీడీపీకి తెలంగాణపై ఈర్ష్య పోలే.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి

టీడీపీకి తెలంగాణపై ఈర్ష్య పోలే.. బీఆర్ఎస్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ తెలంగాణపై ఈర్ష్య తగ్గలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌‌‌‌రెడ్డి విమర్శించారు. మంగళగిరిలో జరిగిన మహానాడులో టీడీపీ నేత బక్కాని నరసింహులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. 

గురువారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండి, డిక్షనరీలో ‘తెలంగాణ’ అనే పదమే లేదని చెప్పడం ఆ పార్టీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. 

బక్కాని నరసింహులు చేసిన వ్యాఖ్యలతో టీడీపీకి సంబంధం లేకుంటే చంద్రబాబు వెంటనే ఖండించాలని జీవన్‌‌‌‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఆ వ్యాఖ్యలు చంద్రబాబు అభిప్రాయంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.