అసలు సినిమా ముందుంది... తొమ్మిదేండ్లలో చూసింది ట్రైలరే: కేటీఆర్

అసలు సినిమా ముందుంది... తొమ్మిదేండ్లలో చూసింది ట్రైలరే: కేటీఆర్
  • వచ్చే ఎన్నికల్లో 95–100 సీట్లు గెలుస్తం 
  • అప్పులు చేసి పెట్టుబడి పెడ్తే తప్పేంటి? 
  • కాళేశ్వరంతో రెండు పంటలకు కలిపి90 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నం
  • ఈ ప్రాజెక్టుకు లక్ష కోట్లు పెడ్తే.. వడ్ల దిగుబడి ఐదు రెట్లు పెరిగిందని వెల్లడి 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈ తొమ్మిదేండ్లలో చూసింది ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడ్డాక 119 సీట్లలో 63 గెలిచినం. తర్వాత మా ప్రభుత్వ పాలన నచ్చడంతో 2018లో ప్రజలు 88 సీట్లలో గెలిపించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 సీట్లు రావడం గ్యారెంటీ. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణను మరింతగా మారుస్తాం. మొదటి తొమ్మిదేండ్లు చూసింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇక నుంచి మొదలవుతుంది” అని చెప్పారు. గురువారం హైదరాబాద్​లో క్రెడాయ్ ఆఫీసును కేటీఆర్ ప్రారంభించి, మాట్లాడారు. ‘‘కేసీఆర్ పార్టీ ప్రెసిడెంట్, సీఎం. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ప్రతిపక్ష నేతలలాగా ఆయన ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు” అని అన్నారు. ‘‘టయర్‌‌‌‌ 2 సిటీలకు కూడా ఐటీ కంపెనీలు వచ్చేలా చేస్తున్నం. తొమ్మిదేండ్లలో హైదరాబాద్‌‌‌‌లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3 లక్షల నుంచి 9 లక్షలకు పెరిగింది” అని చెప్పారు. 

రాష్ట్ర పథకాలను కాపీ కొడుతున్నరు.. 

రాష్ట్ర స్కీమ్‌‌‌‌లను కేంద్రం పేరు మార్చి అమలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. ‘‘మేం రైతుబంధు తెస్తే, మోదీ దాన్ని పీఎం కిసాన్‌‌‌‌గా మార్చి అమలు చేస్తున్నారు. మేం మెగా టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌ను ముందే తెస్తే, మోదీ పీఎం మిత్రా పేరుతో స్కీమ్‌‌‌‌ తెచ్చారు. ఇలా అనేక స్కీమ్‌‌‌‌లను కాపీ కొట్టారు. తెలంగాణ ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తున్నది” అని చెప్పారు. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌గఢ్ ప్రజలు తమ పథకాలకు ఆకర్షితులు అవుతున్నారని.. అందుకే టీఆర్ఎస్​ను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌గా మార్చామని తెలిపారు. ‘‘తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో పాగా వేస్తాం. జాతీయ రాజకీయాల్లో కేవలం గుజరాతోళ్లకే కాదు.. మాకు కూడా తాడు బొంగరం ఆడించడం వచ్చు అని చూపిస్తాం” అని అన్నారు.  

కాళేశ్వరంతో 90 లక్షల ఎకరాలకు నీళ్లు..

కార్పొరేట్లకు ఇచ్చిన రూ.12 లక్షల కోట్ల లోన్లను మోదీ ప్రభుత్వం మాఫీ చేస్తే తప్పు కాదు గానీ, పేదల కోసం ఉచిత పథకాలు అమలు చేస్తే తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క బిల్డింగ్ కట్టడానికే ఏడాది పడుతుందని, కానీ తాము లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ను నాలుగేండ్లలోనే పూర్తి చేశామన్నారు. ఈ ఒక్క ప్రాజెక్ట్‌‌‌‌తోనే  రెండు పంటల్లో 90 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నామని తెలిపారు. ఇవేవీ కనపడనట్టు కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నామని ప్రతిపక్షాలు అంటున్నాయి. జాబ్ రాగానే ఇల్లు కట్టుకోవడానికి లేదా కారు కొనుక్కోవడానికి యువత అప్పులు చేస్తున్నారు. వాళ్లే అంత డైనమిజం చూపిస్తుంటే, రాష్ట్రం చూపించొద్దా? అప్పు చేసి పెట్టుబడి పెట్టడం తప్పు కాదు. రూ.81 వేల కోట్లు అప్పు చేసి, ఎలక్ట్రిసిటీ రంగంలో పెడితేనే కరెంట్ కష్టాలు పోయాయి. రూ.లక్ష కోట్లు తెచ్చి కాళేశ్వరం కడితేనే.. 2014లో 68 లక్షల టన్నుల వడ్లు పండగా, ఇప్పుడు 3.5 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి” అని తెలిపారు. 

కరెంట్, నీళ్ల సమస్యల్లేవ్.. 

తెలంగాణ వచ్చాక కరెంట్‌‌‌‌, సాగు, తాగునీటి సమస్యలే లేకుండా చేశామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సమర్థవంతమైన పాలనతో కేవలం తొమ్మిదేండ్లలోనే ఇదంతా సాధ్యమైందన్నారు. ‘‘చంద్రబాబు ఐటీని తెచ్చిన వ్యక్తిగా పేరొందారు. వైఎస్ రాజశేఖరెడ్డి రైతుల పక్షపాతిగా పేరొందారు. కేసీఆర్ మాత్రం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న లీడర్‌‌‌‌‌‌‌‌గా నిలిచారు” అని అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిచాక మొదటి ఏడాది కుర్చీ సర్దుకోవడానికే పోతది. చివరి ఏడాది మళ్లా ఎలక్షన్ లొల్లిలో పోతది. మధ్యలో మిగిలేది మూడేండ్లే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్‌‌‌‌లు కట్టడం అంత ఈజీ కాదు. ఒక్కప్పటి తెలంగాణ ఇప్పుడెలా మారిందో చూడాలి” అని అన్నారు. ‘‘ఒకప్పుడు గంటలు గంటలు కరెంట్ పోయేది. కానీ ఇప్పుడు వర్షం పడినప్పుడు ఓ పది నిమిషాలు పోతెనే.. ట్విట్టర్ లో మెసేజ్ లు పెడుతున్నరు. ఇదేనా బంగారు తెలంగాణ? అని ప్రశ్నిస్తున్నరు. గతంలో ఆరేసి గంటలు పోతే అడిగినోడు లేడు కానీ, ఇయ్యాలా పది నిమిషాలకే ఆగమాగం, ఢాం ఢూం అని తిట్టుడు మొదలుపెడుతున్నరు” అని ఫైర్ అయ్యారు.