వంద సీట్లు గ్యారెంటీ.. బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ ఖాయం : కేసీఆర్

వంద సీట్లు గ్యారెంటీ..  బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ ఖాయం  : కేసీఆర్

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 95 నుంచి 100 అసెంబ్లీ  స్థానాల్లో గెలవనుందని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జోస్యం  చెప్పారు.  మేడ్చల్‌ జిల్లా తూంకుంటలోని కన్వెన్షన్‌ హాల్‌లో గజ్వేల్‌ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

గజ్వేల్‌ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద ఉండొద్దన్నదే తన లక్ష్యమని  కేసీఆర్  చెప్పుకొచ్చారు.  రాష్టానికి తలమానికంగా గజ్వేల్ ను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.   గతంలో తెలంగాణ నేతలకు టికెట్లు కేటాయించేటప్పుడు దారుణమైన పరిస్థితులు ఉండేవని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పార్టీ టికెట్ల కోసం పోయిన నేతలను చులకనగా చూశారని తెలిపారు. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందని బెదిరించేవారిని, కానీ ఇప్పుడు అన్నీ రంగాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నారు.

ALSO READ: గల్ఫ్ బాధిత కార్మికుల గోసను పట్టించుకోకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీ
 

మిషన్‌ భగీరథకు స్ఫూర్తి సిద్దిపేటలో అమలు చేసిన తాగునీటి పథకమేనని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.  గతంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటి బిందెల ప్రదర్శన ఉండేదని, కానీ ఇప్పుడు  రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితి లేదన్నారు.  వలస పోయిన రైతులు మళ్లీ గ్రామాలకు రావాలనే లక్ష్యంతో పనిచేశామని సీఎం తెలిపారు.