
- రాబోయే ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంక్‌లా ప్రాజెక్ట్
- నమామి గంగేకు 40 వేల కోట్లయితే.. మూసీకి 1.5 లక్షల కోట్లు ఎందుకు?
- మూసీ ప్రక్షాళనపై అందరినీ ఒప్పించాకే ముందుకెళ్లాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తున్నదని అన్నారు. 2,400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల ఖర్చయితే, 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు రూ.1.5 లక్షల కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ పాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు.. ఇండ్లు కూల్చేయాలని ఇందిరమ్మ చెప్పిందా? లేకుంటే సోనియమ్మ చెప్పిందా? అని అడిగారు. పేదల బాధ హైకోర్టుకు అర్థమైందని, అందుకే చట్ట ప్రకారం వెళ్లాలని చెప్పిందన్నారు.
తాము అందరినీ ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని, మూసీ ప్రక్షాళనపై కూడా అందరినీ ఒప్పించిన తర్వాతే చట్ట ప్రకారం ముందుకెళ్లాలని కేటీఆర్ డిమాండ్‌చేశారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని, ఇందుకోసం తమ ప్రభుత్వం ఉన్నప్పుడే సీవేజ్ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లను నిర్మించామని తెలిపారు. అసలు ఇప్పుడు కొత్తగా మూసీని ఏం చేయాలనుకుంటున్నారో తొలుత ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాన్ని నడుపుతామంటే కుదరదని, బుల్డోజర్లకు తాము అడ్డుపడుతామని అన్నారు. 50 ఏండ్ల కిందట నిర్మించుకున్న ఇండ్లను ఇప్పుడు కూల్చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఇష్టమొచ్చినట్టు నిర్మాణాల జరిగాయని, వాటికి పర్మిషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలేనని చెప్పారు. దమ్ముంటే పర్మిషన్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్‌పై ఒత్తిడి చేస్తున్నదెవరు?
మూసీ ప్రాజెక్ట్ విషయంలో రేవంత్‌పై ఎవరో ఒత్తిడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ప్రశ్నలకు, ఆర్తనాదాలకు సమాధానం చెప్పలేక సీఎం మీడియా ముందుకు రావడం లేదని అన్నారు. అధికారులను ముందుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ ద్వారా ఎవరికి ప్రయోజనమో రేవంత్ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసలు రేవంత్ ఇల్లు, ఆయన సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయని, దమ్ముంటే తొలుత వాటిని కూల్చేయాలని సవాల్ చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను కూడా కూల్చాలన్నారు.
హైడ్రాను అడ్డుకుంటే హైదరాబాద్ మునిగిపోతుందని కమిషనర్ రంగనాథ్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రేవంత్‌తో దోస్తాన్ చేసి మంత్రి శ్రీధర్‌బాబు కూడా చెడిపోయిండని, ఆయన ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టేలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. పేదలు, చిన్న పిల్లల ఆవేదన శ్రీధర్‌బాబుకు అర్థంకావడం లేదన్నారు.