- బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నర్సంపేట/ వర్ధన్నపేట/ మహబూబాబాద్/ తొర్రూరు, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో జనాలు 'కారు గుర్తుకు ఓటేస్తే.. కేసీఆర్‍కు ఓటేసినట్లేనని' బీఆర్‍ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్‍రెడ్డి ఎన్కటి రోజులు తెస్తా అని జనాలను నట్టేట ముంచాడని ఆరోపించారు.
ఆరుగ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. యూరియా కోసం రైతులు గోస పడుతున్నారని, ప్రజలు పాలిచ్చే బర్రెను విడిచి తన్నె బర్రెను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోసపోవద్దని, ఆగం కావద్దని అంటూ ఎవరికి ఓటేస్తే ఏంవస్తుందో ఆలోచించాలని చెప్పారు. ఆయా రోడ్డు షోలలో కేటీఆర్ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, నన్నపనేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
