పార్లమెంటుపై పార్టీల ఫోకస్

పార్లమెంటుపై పార్టీల ఫోకస్
  • 10 సీట్లు లక్ష్యంగా బీజేపీ కమిటీలు
  • నామినేటెడ్ పై కాంగ్రెస్ మీటింగ్
  • పార్లమెంటు ఎన్నికలపైనా చర్చ
  • సీఎం అధ్యక్షతన ప్రత్యేక సమావేశం
  • గులాబీ పార్టీ రివ్యూలు స్టార్ట్
  • రాష్ట్రంలో వేడెక్కిన పొలిటికల్ వెదర్

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలపై రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా రివ్యూ మీటింగులు జరుగుతున్నాయి. తొలుత ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై డిస్కస్ చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో  మాజీ మంత్రులు హరీశ్ రావు,నిరంజన్ రెడ్డి, కడియం శ్రీహరి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొని సమీక్షలు నిర్వహిస్తున్నారు.  

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీప్ దాస్ మున్షి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. నామినేటెడ్  పదవుల కేటాయింపు, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.

మరో వైపు బీజేపీ కూడా పార్లమెంటు ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి  నేతృత్వంలో ముఖ్య నేతల సమావేశం జరగనుంది. డబుల్ డిజిట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న కమల నాథులు ఎన్నికల కమిటీల నియామకంపై చర్చించనున్నారు.