రేవంత్​ సీఎంగా ఉంటేనే కేసీఆర్​ విలువ తెలుస్తది

రేవంత్​ సీఎంగా ఉంటేనే కేసీఆర్​ విలువ తెలుస్తది
  • ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్​ తెచ్చిన కరువు
  • జంగ్ సైరన్ ఊదేందుకుకరీంనగర్​కు అధినేత కేసీఆర్  
  • బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి

కరీంనగర్​, వెలుగు : రేవంత్ సర్కారును తాము కూల్చబోమని, ఆయన ఐదేండ్లు సీఎంగా ఉంటేనే ప్రజలకు కేసీఆర్​ విలువ తెలుస్తుందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ పేర్కొన్నారు.  ఎన్నికలవగానే రేవంత్ మరో ఏక్​నాథ్​ షిండే, హిమంత బిశ్వశర్మ కావడం ఖాయమని, ఎమ్మెల్యేలను తీసుకునిపోయి బీజేపీలో కలుస్తాడని అన్నారు. కరీంనగర్​లోని ఓ హోటల్​లో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

కాంగ్రెస్​లోని పెద్ద మనుషులతోనే రేవంత్​కు ఇబ్బందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత కరువు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఎద్దేవా చేశారు.  90 ‌‌‌‌రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రజాభిమానాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. లిఫ్ట్​ ఇరిగేషన్​లో కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని, 85 పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగితే దిద్దుబాటు చర్యలు చేయరా? అని ప్రశ్నించారు.  

420 హామీలు నెరవేర్చకుంటే వెంటపడుతం

రేవంత్​ సర్కారు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చకపోతే తాము వెంటపడతామని కేటీఆర్​ హెచ్చరించారు. కేసీఆర్​కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా అని, అబద్ధాల రేవంత్​ మీద జంగ్ సైరన్ మోగించడానికి త్వరలో ఆయన ఉద్యమగడ్డకు వస్తున్నారని చెప్పారు. మహానుభావులు ఎంపీలుగా గెలిచిన ఈ ప్రాంతం నుంచి బండి అడ్డిమారిగా గెల్చిండని, ఏం మాట్లాడుతాడో ఆయనకే తెల్వదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే బండి సంజయ్ కరీంనగర్ కమాన్ దగ్గరకు రావాలని.. కరీంనగర్​ అభివృద్ధికి వినోద్​కుమార్​ ఏం చేసిండో.. బండి ఏం చేసిండో తేల్చుకుందామని సవాల్​ విసిరారు.

బండి సంజయ్ ఓ సైకో లెక్క తిట్లు తిట్టడం తప్ప చేసిందేమీ లేదని, శివలింగం మీద తేలులాగా బండి సంజయ్ తయారయ్యాడని దుయ్యబట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్​ను తల్లికి పుట్టినవా అని అడగడం కరెక్టేనా? ఇటువంటి వ్యక్తి ఎంపీగా అవసరమా? అంటూ సంజయ్​పై ఫైర్ అయ్యారు.  తమపై కోపంతో అన్నదాతల నోట్లో మట్టికొట్టొద్దని, వెంటనే నీళ్లివ్వాలని గంగుల కమలాకర్​ కోరారు.