గౌడవెల్లిలో దారుణం.. ముళ్ళ పొదల్లో అప్పడే పుట్టిన పసికందు

గౌడవెల్లిలో దారుణం.. ముళ్ళ పొదల్లో అప్పడే పుట్టిన పసికందు

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో మంగళవారం పాశవిక చర్య వెలుగులోకి వచ్చింది. గౌడవెల్లి రైల్వే గేట్ దగ్గర ముళ్ళపొదల్లో పసికందు ఏడుపు వినిపించింది. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ లోపలికి వెళ్లి చూడగా బొడ్డుకూడ ఊడని ఆడ శిశువు పాలిథిన్ కవర్లో చుట్టి పడివేసినట్టు గుర్తించాడు. వెంటనే పక్కనే హోటల్ నిర్వహిస్తున్న లక్ష్మికి చెప్పాడు. వారు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. 

గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్కడికి చేరుకొని అశా కార్యకర్త, ఏఎన్ఎంకు సమాచారం తీసుకొని హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లాడు. అందరూ కలిసి ఆ శిశువును ముళ్ల పొదల్లో నుంచి జాగ్రత్తగా బయటికి తీశారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శిశువు తల, చెంపకు అంటుకున్న చీమలను తొలగించడంతో ప్రథమ చికిత్స అందించి, మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులతో పాటు సీడీపీవోకు సమాచారం అందించారు. సీడీపీవో శారద శిశువును ఆరోగ్య కేంద్రానికి తరలించేలోపే అక్కడికి చేరుకున్నారు. వైద్యులు పాపకు తగిన వైద్యం అందించారు.