దమ్ముంటే కేసీఆర్ బాసరకు రావాలి

దమ్ముంటే కేసీఆర్ బాసరకు రావాలి

నిజామాబాద్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శనివారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు హాస్పిటల్ పాలయితే విద్యా శాఖ మంత్రి సబిత హాస్పిటల్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎన్నో నెలలుగా తమ క్యాంపస్ లో సమస్యలు నెలకొన్నాయని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మొరపెట్టుకున్నా... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆహారం నాసిరకంగా ఉంటోందని ఆరోపిస్తూ ఫుడ్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్థులు ఎంత మొత్తుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

ఇప్పటికైనా ఆ ఫుడ్ కాంట్రాక్టర్ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి... అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యా వ్యవస్థలోని సమస్యల గురించి ఎన్నోసార్లు చెప్పిన సీఎం పట్టించుకోలేదన్న ఆయన... రాష్ట్ర విద్యా వ్యవస్థను  కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బాసర ట్రిపుల్ ఐటీల పర్యటించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ప్రభుత్వం ప్రజల,విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.వాళ్ళ కుటుంబాలు బాగుంటే చాలని కోరుకుంటున్నారని విమర్శించారు.
ఒక్క బాసర కాలేజీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిస్థితి ఇలాగే ఉందని  తెలిపారు. ఎనిమిదేళ్ళ పాలనలో కేసీఆర్ ఒక్క యూనివర్సిటీకి వెళ్ళలేదని,దమ్ముంటే కేసీఆర్ బాసరకు రావాలని సవాల్ విసిరారు. 

సర్వేలతో బిజీగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం,చేతనైతే యూనివర్సిటీలలో,హాస్పిటల్స్ లో,మేధావులతో సర్వే చేయించాలని సూచించారు.ఈ సర్వేను నమ్ముకుంటే కేసీఆర్ రాబోయే కాలంలో దిమ్మతిరగడం ఖాయమన్నారు.ప్రజలు ఈ సర్వేలను నమ్మి మోసపోవద్దని కోరారు. తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల,భవిష్యత్,యోగక్షేమాలు అవసరం లేదని,కేవలం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులుంటే చాలని గుర్తుచేశారు. కావున ప్రజల,యోగక్షేమాల కోసం పట్టించుకోని ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలని,కేసీఆర్ కు సిఎం గా కొనసాగే అర్హత లేదన్నారు.డెబ్బై వేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రికి,ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదని హేళన చేశారు.