
బీఆర్ఎస్ లీడర్లు..ముస్లింలకు అన్యాయం చేస్తున్రు
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రంజాన్ మాసం వస్తే.. ఇఫ్తార్ దావత్, బట్టలు పంచి ముస్లింలను మోసం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని బీఎస్పీ స్టేట్ ఆఫీస్‌లో బుధవారం ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. చీఫ్ గెస్ట్‌గా రాజ్యసభ ఎంపీ, ఏడు రాష్ట్రాల బీఎస్పీ ఇన్చార్జ్, నేషనల్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.
ఖదీర్ ఖాన్ పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోతే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బాధిత కుటుంబానికి సాయం చేయలేదని ఫైర్ అయ్యారు. నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను లీజుకు ఇచ్చి, దానిపై వచ్చిన ఆమ్దానీని ముస్లింల అభివృద్ధికి ఉపయోగించడం లేదని ఆరోపించారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 12% జనాభా ఉన్న ముస్లింలకు బడ్జెట్ లో కేవలం రూ.2వేల కోట్లే కేటాయించి అన్యాయం చేశారన్నారు.
రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి వారిని మోసం చేశారని విమర్శించారు. ప్రోగ్రాంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, సీనియర్ లీడర్లు చంద్రశేఖర్ ముదిరాజ్, వెంకటేశ్ చౌహాన్, సతీశ్, బాలస్వామి, మౌలానా షఫి, అబ్రార్ హుస్సేన్, అనితా రెడ్డి, నిర్మల, అరుణ క్వీన్, సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.