
తెలంగాణలో బహుజనులను కేసీఆర్ మోసం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ రాంజీ గౌతమ్ ఆరోపించారు. సెక్రటేరియట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టడం, ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన.. ఇక్కడి పేదలు సంతోషకరమైన జీవితాన్ని జీవించలేరని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు హామీ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక బీసీల కులగణన చేసి, బీసీల రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ ను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంబేడ్కర్, ఫూలే, సాహు మహరాజ్ ఆశయాలను నెరవేర్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని రాంజీ గౌతమ్ పేర్కొన్నారు.
కరీంనగర్ రేకుర్తిలో మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో బీఎస్పీ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి రాంజీ గౌతమ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరైయ్యారు.