ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది... అంటాడు గౌతమబుద్ధుడు. సృష్టిలోని ప్రతి ప్రాణి ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా స్నానం చేస్తుంది. జలచరాలు నిత్యం స్నానంలో తేలియాడుతుంటాయి. ఉభయచరాలు కొద్దిసేపు స్నానం చేసి, భూమ్మీదకు వచ్చి, మళ్లీ నీటిలోకి వెళ్లి హాయిగా స్నానం చేస్తాయి. ఏనుగు వంటి అతి పెద్ద జంతువు నీటి మడుగులోకి దిగి తన తొండం నిండుగా నీటిని తీసుకుని, ఒంటిని శుభ్రపరుచుకుంటుంది. నేల మీదకు వచ్చి మళ్లీ అదే తొండంతో ఒంటి నిండా మట్టి పోసుకుంటుంది. ఈ విధంగా కరణీ బృందం స్నానం చేస్తూనే ఉంటుంది. గజేంద్ర మోక్షం కథలో ఏనుగు స్నానం చేస్తుండగానే మొసలి పట్టుకుంటుంది. ఆ కథ వేరు.
జంతు ప్రదర్శనశాలలో సైతం జంతువుల కోసం నీటి మడుగులు ఏర్పాటుచేస్తారు. పులులు, సింహాలు వంటివి ఆ నీటిలో ఈదుతూ, స్నానం చేసి అలసిన దేహాన్ని శుభ్రపరచుకుని హాయిగా నిద్రపోతాయి. పసిపిల్లలకు స్నానం చేయించి, సాంబ్రాణి పొగ వేయగానే కంటి నిండా హాయిగా నిద్రపోతారు. నీటికి అంత శక్తి ఉంది. క్రీడాకారులు, వ్యాయామం చేసేవారు, కళాకారులు... వారి వారి ప్రదర్శనలు పూర్తి కాగానే ముందుగా స్నానం చేస్తారు. అప్పటివరకు కలిగిన అలసటంతా ఒక్కసారిగా చేత్తో తీసివేసినట్లు మాయమవుతుంది. నీటికి అంత శక్తి ఉంది. నిప్పులను కూడా నీటితో కడుగుతారనే జాతీయం వాడుకలో ఉంది. అంతెందుకు పచ్చటి పొలాలు సైతం నీటితో తడిసి ముద్దయితేనే, మంచి దిగుబడిని ఇస్తాయి. పూలు, పండ్లు, ఆకులు, కాయలు... అన్నీ నీటితో స్నానం చేస్తేనే పరిశుభ్రపడి, ఆరోగ్యకరమైన పండ్లు, పూలను మనకు పంచుతాయి. అదీ నీటితో స్నానం గొప్పతనం.
రెండవది మౌనం
మౌనంగా ఉండేవారిని మునులు అంటారు. కేవలం పైకి మాత్రమే కాదు, మనసులో కూడా మౌనంగా ఉండేవారు మునులు. వారు కోపాన్ని జయించగలరు. వారిని ఎన్నిరకాలుగా తూలనాడినా తిరిగి ఒక్క పరుష భాషణం కూడా చేయరు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయాన మన జాతిపిత మహాత్మా గాంధీజీ అహింసా మార్గాన్ని అవలంబిస్తూ, మౌనంగానే తన నిరసనను ప్రదర్శించారు. స్వాతంత్య్రం సాధించారు. ‘మహాత్ముడు’, ‘జాతిపిత’గా చరిత్రలో నిలిచిపోయారు. వశిష్ఠుడి దగ్గర ఉండే గోవులు కావాలని కార్తవీర్యార్జునుడు కోరినప్పుడు వశిష్ఠుడు మౌనంగా తిరస్కరించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు యుద్ధం ప్రకటించాడు. వశిష్ఠుడు మౌనంగా ఉండిపోయాడు. అతని దగ్గర ఉండే కామధేనువు యుద్ధం చేసి గెలుపు సాధించింది. ఆ విధంగా మౌనంగానే వశిష్ఠుడు విజయం సాధించాడు. బ్రహ్మర్షి అయ్యాడు. చరిత్రలో ఎన్నో మౌన పోరాటాలు మనకు తెలిసినదే. మనిషి గెలుపుకి మౌనాన్ని మించిన ఆయుధం లేదు. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన సందర్భంలో దుర్యోధనుడు పరుషంగా మాట్లాడతాడు. శ్రీకృష్ణుడు మౌనంగా.. నవ్వు రాజిల్లెడు మోముతో, విశ్వరూప సందర్శనంతో వారికి తాను ఏమిటో చూపించి, యుద్ధంలో పార్థసారథిగా నిలబడి, పాండవులకు మౌనంగానే విజయం చేకూర్చాడు. మౌనం అనేది అత్యంత బలమైన ఆయుధం.
మూడవది ధ్యానం
ధ్యానం అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది. స్నానం బాహ్య శరీరాన్ని శుభ్రపరుస్తుంది, ధ్యానం అంతరాత్మను శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే అంతరాత్మ పరిశుభ్రపడుతుందో, అప్పుడు మనసు దైవమార్గం వైపు పయనిస్తుంది. పూర్వకాలంలో ఎంతోమంది ఋషులు ధ్యానం చేయటం ద్వారా ఆత్మావలోకనం చేసుకునేవారు. కాళహస్తీశ్వర మహాత్మ్యంలోని తిన్నడి కథ ఇందుకు ఉదాహరణ. తిన్నడు... జంతువులను వేటాడుతూ, దైవాన్ని దూషిస్తూ జీవించేవాడు. ఒకనాడు అతనిలో పరివర్తన కలిగింది. శివుడి కంటి నుంచి రక్తం కారుతుంటే, ఆ కంటి స్థానంలో ఉంచేందుకుగాను తన కళ్లను ఆ పరమశివునికి అర్పించుకుంటాడు. భగవంతుడు ప్రత్యక్షమై తిన్నడికి తిరిగి చూపు ప్రసాదిస్తాడు. నాటి నుంచి ఆ తిన్నడు భక్త కన్నప్పగా మారాడు. రామకృష్ణ పరమహంస నిరంతరం ధ్యాన సమాధిలో నిమగ్నమై, కాళీమాతను సాక్షాత్కరింపచేసుకున్నాడు. ఆ తల్లితో నిత్యం సంభాషించేవాడని వారి శిష్యులు చెబుతారు. వివేకానందుడు సైతం రామకృష్ణపరమహంసను గురువుగా భావించి, ఆయన చేసిన ఉపదేశంతో ధ్యానం చేస్తూ, జ్ఞానం సంపాదించుకున్నాడు. ప్రపంచమంతా పర్యటిస్తూ, అందరికీ బోధలు చేశాడు. ధ్యానం అంటే మనసును ఇతర వ్యామోహాల మీదకు పోనీయకుండా, అధీనంలో ఉంచుకుంటూ, సదాలోచనలతో ఉండటం. అలా ఉన్నప్పుడు అంతరాత్మ పరిశుభ్ర పడుతుంది. ఎప్పుడైతే ఇటువంటి ప్రవర్తన అలవడుతుందో, అప్పుడు మనసు దైవమార్గం వైపుగా పయనిస్తుందని బుద్ధభగవానుడు బోధించాడు. - డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232
