ఇస్రో స్పేస్​ బిజినెస్

ఇస్రో స్పేస్​ బిజినెస్
  • ఎన్ ఎస్ ఐఎల్ వింగ్ ను ఏర్పాటు చేసిన కేంద్రం
  • అంతరిక్ష ప్రయోగాలకు మంచి కేటాయింపులు
  • స్పేస్ లో 3 వి భాగాలుగా నిధులు..₹11,177 కోట్లు
  • గత ఏడాదితో పోలిస్తే పెరిగిన బడ్జెట్

న్యూఢిల్లీ: అంతరిక్ష శోధనలో మన దేశం దూసుకుపోతోంది. దేశ ప్రతిష్టను పెంచే ప్రయోగాలు చేస్తోంది. గగన శోధనలో దేశానికంటూ ఓ స్థానం కల్పించేలా ఇస్రో పనిచేస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 14న చంద్రయాన్​కు కొనసాగింపు ప్రయోగం చంద్రయాన్​ 2, వచ్చే ఏడాది గగన్​యాన్​ వంటి ప్రయోగాలను చేయనుంది. అందుకోసం ఇస్రోకు మరింత చేదోడుగా ఉండేలా బడ్జెట్​లో మంచిగానే డబ్బులు కేటాయించింది ప్రభుత్వం. అంతేకాదు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇస్రో కోసం న్యూ స్పేస్​ ఇండియా లిమిటెడ్​ (ఎన్​ఎస్​ఐఎల్​) పేరిట ఓ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇస్రో ఆర్​ అండ్​ డీ ద్వారా వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయనుంది. ఇప్పటిదాకా ఇస్రో వరకే పరిమితవుతున్న రాకెట్లు, ఉపగ్రహాలను ఎన్​ఎస్​ఐఎల్​ ద్వారా మార్కెట్​ చేయనున్నారు. ఇతర కంపెనీలకూ ఆ ఉత్పత్తులు అమ్మనున్నారు. అంతేగాకుండా  స్పేస్​ ప్రొడక్ట్స్​ టెక్నాలజీనీ ట్రాన్స్​ఫర్​ చేస్తారు. తద్వారా ఇస్రో ఖజానాను నింపనున్నారు.

స్పేస్​కు 11 వేల కోట్లు

ఈ ఏడాది స్పేస్​ కోసం మంచి కేటాయింపులే చేసింది కేంద్ర ప్రభుత్వం. స్పేస్​ టెక్నాలజీ (గగన్​యాన్​ సహా), స్పేస్​ అప్లికేషన్లు, ఇన్​శాట్​ సిస్టమ్స్​ కోసం ₹11,177 కోట్లు కేటాయించింది. ఆ మూడింటికీ మళ్లీ వేర్వేరు కేటాయింపులు చేసింది. స్పేస్​ టెక్నాలజీ కోసం ₹8,408 కోట్లు, స్పేస్​ అప్లికేషన్స్​కు ₹1885 కోట్లు, ఇన్​శాట్​ కోసం ₹884 కోట్లు ఇచ్చింది. గత ఏడాది ఈ మూడింటికి కలిపి కేటాయించింది కేవలం ₹9,918 కోట్లు. అయితే, మరో పది రోజుల్లో చేయబోతున్న చంద్రయాన్​ 2 ప్రయోగం గురించి తాజా బడ్జెట్​లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ ప్రయోగానికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పలేదు. ఆ ప్రయోగాన్ని ₹978 కోట్లతో చేపడతామని ఇప్పటికే ఇస్రో ప్రకటించింది. స్పేస్​ టెక్నాలజీకి కేటాయించిన నిధుల నుంచే చంద్రయాన్​ 2కు వాడే అవకాశాలున్నాయి.

స్పేస్ టెక్నాలజీకి గత ఏడాది ₹6576 కోట్లు కేటాయించింది కేంద్రం. ఆ తర్వాత దానిని సవరించి ₹6,993 కోట్లకు పెంచింది. స్పేస్​ అప్లికేషన్స్​కు గత ఏడాది బడ్జెట్ ను ₹1,746 కోట్లకు ​ అంచనా వేయగా, ఆ తర్వాత సవరించి ₹1,595 కోట్లకు తగ్గించింది. దేశ సమాచార వ్యవస్థకు మూల స్తంభమైన ఇన్​శాట్​ (ఇండియన్​ నేషనల్​ శాటిలైట్​ సిస్టమ్స్​) కోసం ₹884 కోట్లు కేటాయించింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి బడ్జెట్​లో కోత పెట్టింది. గత బడ్జెట్​లో ₹412 కోట్ల బడ్జెట్​ను అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో బడ్జెట్​ను మూడింతలకు పైనే చేసింది. దీంతో ఇన్​శాట్​ శాటిలైట్​ సిస్టమ్స్​ కోసం గత ఏడాది ఇచ్చిన బడ్జెట్​ ₹1,330 కోట్లకు చేరింది. ఈ సారి దాదాపు ₹500 కోట్లు కట్​ చేసింది. సవరించిన అంచనాల్లో దానికి ఏమైనా పెంచుతుందేమో వేచి చూడాలి.

ప్రస్తుతం ఇన్​శాట్​ వ్యవస్థ ద్వారానే టీవీ ప్రసారాలు, టెలీ కమ్యూనికేషన్​, వాతావరణ వివరాలు, విపత్తుల నిర్వహణ తదితర సేవలను ఇన్​శాట్​ అందిస్తోంది. 1983లో చేపట్టిన ఈ ఇన్​శాట్​ ప్రోగ్రాంలో ఇప్పటి వరకు 24 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. అందులో ఇప్పుడు 11 మాత్రమే పనిచేస్తున్నాయి. అంతరిక్ష శాఖ, టెలీకమ్యూనికేషన్స్​ శాఖ, భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఆలిండియా రేడియో, దూరదర్శన్​లు కలిసి ఈ ఇన్​శాట్​ ప్రోగ్రామ్​ను చేపట్టాయి.