ఉద్యోగులకు గుడ్ న్యూస్ : రూ.5లక్షల వరకు పన్ను లేదు

ఉద్యోగులకు గుడ్ న్యూస్ : రూ.5లక్షల వరకు పన్ను లేదు

Budget 2019 : Tax Slab Increased To 5 Lakh Rupees, Says Piyush Goyal

ఢిల్లీ : ఎన్నికల ముందు వరాల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం. లోక్ సభలో ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ అత్యంత ఆకర్షనీయ ప్రకటనలు చేశారు. ఉద్యోగులు గత బడ్జెట్ లో కొంత నిరాశకు లోనైనా.. ఈసారి బడ్జెట్ లో షాకింగ్ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని వార్షిక ఆదాయం రూ. 2.5లక్షల రూపాయల నుంచి .. రూ.5 లక్షలకు పెంచింది. పన్నులేని ఇన్ కం టాక్స్ పరిమితిని గతంలో ఉన్నదానికంటే డబుల్ చేసింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించే మిడిల్ క్లాస్ ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ఈ ఆదాయపు పన్నుతో ప్రయోజనం దక్కనుంది.

రూ.6.5లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవాళ్లు.. ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్, మ్యూచుఫల్ ఫండ్ లాంటి స్కీముల్లో పెట్టుబడులు చూపిస్తే.. పన్ను మినహాయింపు పొందవచ్చని పియూష్ గోయల్ చెప్పారు. స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచారు. పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితిని రూ. 10వేల నుంచి రూ.40వేలకు పెంచారు.

వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని రూ.5లక్షలకు పెంచామని పియూష్ గోయల్ చెప్పగానే… లోక్ సభ చప్పట్లతో దద్దరిల్లింది.

పేద రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం ఈ బడ్జెట్ లో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. పేద, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6వేల పంటసాయం అందించే ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధిని ప్రకటించింది. అరుణ్ జైట్లీకి అనారోగ్యం కారణాలతో అమెరికాలో చికిత్స తీసుకుంటుండటంతో.. పియూష్ గోయెల్ బడ్జెట్ 2019-20ను ప్రవేశపెట్టారు.