వైన్స్​ల మీదున్న ప్రేమ స్కూళ్లపై లేదు.. ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం

వైన్స్​ల మీదున్న ప్రేమ స్కూళ్లపై లేదు.. ప్రభుత్వంపై  తీన్మార్ మల్లన్న ఆగ్రహం

మెదక్ (శివ్వంపేట), వెలుగు: తెలంగాణ ప్రభుత్వానికి వైన్స్ ల మీదున్న ప్రేమ స్కూళ్లపై లేదని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో బుధవారం 7200’ కార్యాలయాన్ని ప్రారంభించారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ఏడుగురు స్టూడెంట్స్ కు ప్రైజ్ మనీ బహుకరించారు. ఈ సందర్బంగా మల్లన్న మాట్లాడుతూ వర్షాలు పడుతున్నాయని స్కూళ్లు బంద్ పెట్టి వైన్స్ లు ఓపెన్​గా పెట్టడంతోనే ప్రభుత్వానికి దేనిపై శ్రద్ధ ఉందో అర్థమవుతోందన్నారు. దేశంలోనే విద్యకు అతి తక్కువ ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ అన్నారు. బడ్జెట్​ కేటాయింపులు టీచర్ల జీతాలకు సరిపోతున్నాయి తప్ప విద్యాభివృద్ధికి అందడం లేదని చెప్పారు. 

ఉన్న స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించకుండా గురుకుల పాఠశాల అని పేర్లు మారుస్తూ మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. కేసీఆర్​తొమ్మిదేండ్ల పాలనలో తొమ్మిదివేల స్కూళ్లు మూతపడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలను అసలు పట్టించుకోకుండా ప్రైవేట్​ యూనివర్సిటీలకు పెద్ద పీట వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు దళిత బంధు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.1,800 కోట్ల బడ్జెట్ పెడితే బీసీలకు ఇచ్చింది రూ. 264 కోట్లు మాత్రమేనని చెప్పారు. కేసీఆర్​ ప్రవేశపెట్టిన స్కీంలు ఓట్ల కోసమే తప్ప ప్రజలకు ఉపయోగపడేవి కావన్నారు. కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం మండల ఇన్​చార్జి రమణ, నాయకులు నగేశ్, రవి, రమేశ్ పాల్గొన్నారు.డిమాడ్లు తీర్చాలి 

మనోహరాబాద్, వెలుగు: పారిశుద్ధ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని తీన్మార్ మల్లన్న కోరారు. బుధవారం మనోహరాబాద్ మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లను పరిశీలించారు. మండలంలోని కాళ్లకల్లో ఇటీవల ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ఇండ్ల బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మల్లన్న డిమాండ్​ చేశారు.