అబద్ధాలు కాదు.. వాస్తవ బడ్జెట్ : సీఎం రేవంత్​రెడ్డి

అబద్ధాలు కాదు.. వాస్తవ బడ్జెట్  :  సీఎం రేవంత్​రెడ్డి

 

  • తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయపదం అన్నట్టుగా కేసీఆర్ ​మార్చిండు
  • అబద్ధాల పునాదుల మీదనే గత ప్రభుత్వం నడిచింది
  • అసెంబ్లీలో చూద్దామన్నా కేసీఆర్  వస్తలేడు
  • హరీశ్​రావు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నడు
  • సొంత ఎమ్మెల్యేలనే బీఆర్​ఎస్​ హైకమాండ్​ అనుమానిస్తున్నది
  • సెక్రటేరియెట్​ నిర్మాణ ఖర్చులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తం

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ అంటేనే అబద్ధానికి పర్యాయపదం అన్నట్టుగా కేసీఆర్​ మార్చేశారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘అబద్ధాల పునాదుల మీద గత ప్రభుత్వం తెలంగాణను నడిపింది. పదేండ్లలోనూ బడ్జెట్​అంచనాల్లో వాస్తవికత ఏమిటో కేసీఆర్​తెలుసుకోలేకపోయిండు” అని విమర్శించారు. శనివారం అసెంబ్లీలోని తన చాంబర్​లో సీఎం రేవంత్​రెడ్డి మీడియాతో చిట్​చాట్​ చేశారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు నెలల్లోనే వాస్తవాలను గుర్తించి నిజమైన అంచనాలతో బడ్జెట్​రూపొందించారని, తమ పాలనలో అబద్ధాలు చెప్పొద్దనే బడ్జెట్ వాస్తవికంగా పెట్టామని వివరించారు. ‘‘ఒక్క రోజు అబద్ధం చెప్తే 365 రోజులు బాధ పడాల్సి వస్తుంది” అని అన్నారు. కాళేశ్వరం అప్పులకే రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని, కేసీఆర్ చేసిన పనితో ఇరిగేషన్ డిపార్ట్​మెంట్, ప్రభుత్వం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఈ నెల 13న రావాలని అన్ని పార్టీల ఫ్లోర్​లీడర్లను మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆహ్వానిస్తారని, బీఆర్ఎస్​వాళ్లు ఆ రోజు రాలేకపోతే వాళ్లు సూచించిన మరో రోజు మేడిగడ్డకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని పార్టీల ఫ్లోర్​లీడర్లను ఆహ్వానిస్తామని, అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకుపోయి చూపిస్తామన్నారు. తానూ మేడిగడ్డకు వెళ్తానని, గతంలో పైనుంచి చూశానని.. కింద ఏం జరిగిందో చూడాలి కదా అని పేర్కొన్నారు. మేడిగడ్డ లోపాలకు బాధ్యులెవరో విజిలెన్స్​తో విచారణలో తేలుతుందని, విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మేడిగడ్డ పనికి వస్తుందా లేదా అనేది కూడా నిర్ణయించాల్సింది తాము కాదని ఎక్స్​పర్ట్​ కమిటీ అని పేర్కొన్నారు. విచారణ పూర్తికాకుండా చర్యలు ఎలా తీసుకోగలమన్నారు. కాళేశ్వరంపై కాగ్​ రిపోర్టు అసెంబ్లీలో పెట్టడంపై స్పీకర్​ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అసెంబ్లీలో చూద్దామన్నా కేసీఆర్ సభకు రావడం లేదని, 12 ఏండ్లు మంత్రిగా పని చేసిన హరీశ్​రావు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

అప్పుడు నా పేరు ఉన్నా బీఏసీలో కూర్చోనివ్వలే

2014లో టీడీపీ నుంచి తనతో పాటు ఎర్రబెల్లి దయాకరరావును బీఏసీకి నామినేట్ చేస్తే  ఒక్కరినే అనుమతిస్తామన్నారని సీఎం రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. ‘‘నా ప్లేస్ లో మరో పేరు ఇస్తే పరిశీలిస్తమన్నరు. నన్ను మాత్రం అనుమతించబోమని అప్పుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు అన్నడు. నేను లోపలికి వెళ్లి కూర్చున్న తర్వాత బయటికి పంపేశారు” అని పేర్కొన్నారు. బీఏసీలో తన పేరు ఉంది కాబట్టే వెళ్లానని, అసెంబ్లీలో ఏం చేయాలన్న స్పీకర్ ​మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 

రైతులను రుణ విముక్తులను చేస్తం

రైతులకు రుణమాఫీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. రైతులను రుణ విముక్తులను చేసి బ్యాంకులకు ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలనేది బీఏసీనే నిర్ణయిస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. 

ఫార్ములా ఈ–రేస్​పై ప్రభుత్వం వివరణ అడిగితే అధికారి ఇచ్చారని, అందులో ఏముందో చూడాల్సి ఉందన్నారు. నేషనల్​హైవేల కింద సేకరించిన భూములు, రియల్​ఎస్టేట్​వెంచర్లకు రైతుభరోసా ఇవ్వబోమని, వ్యవసాయం చేసే వాళ్లకు  మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సీలింగ్​పెట్టడం వంటి వాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 

సొంత ఎమ్మెల్యేలను బీఆర్​ఎస్​ నాయకత్వం అనుమానిస్తున్నది

తనను కలిసిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నాయకత్వం అనుమాని స్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం వస్తే కలుపుకొని పోతామని చెప్పారు. బీఆర్ఎస్​ఎంపీని సీక్రెట్​గా చేర్చుకోలేదని, అందరి ముందే చేర్చుకున్నామని తెలిపారు. 20 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారన్న జగ్గారెడ్డి కామెంట్స్​ గురించి తనకు తెలియదని, ఆయననే అడగాలని సీఎం అన్నారు. రాజ్యసభలో రాష్ట్రానికి మూడు స్థానాలు దక్కుతాయని, కాంగ్రెస్​పార్టీకి ఎన్ని ఓట్లున్నాయి.. ఎంతమందిని పోటీకి దించాలనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.  కొత్త రేషన్​కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఆరోగ్యశ్రీకి రేషన్​కార్డుల లింక్​తీసేశామన్నారు. అందరికీ హెల్త్​ప్రొఫైల్​కార్డులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం చెప్పారు. 

సెక్రటేరియెట్​ ఖర్చుపై తేలుస్తం

సెక్రటేరియట్, అమరవీరుల జ్యోతి, అంబేద్కర్​విగ్రహ నిర్మాణ అంచనాలు, చేసిన వ్యయంపై విజిలెన్స్ విచారణ చేయిస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘పది పైసలు అయ్యేదానికి 11 పైసలు ఖర్చయితే ఓకే.. అంతకన్నా ఎక్కువ అయిందంటే ఏదో ఉన్నట్టే కదా..! పది రూపాయలు ఖర్చు చేస్తే అది అద్భుతం అవుతుందా?’’ అని ప్రశ్నించారు. కలెక్టరేట్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయనే విషయం తన దృష్టికి రాలేదని అన్నారు.