గెల్లును గెలిపిస్తే  గొర్రెల హాస్టల్ కట్టిస్త

గెల్లును గెలిపిస్తే  గొర్రెల హాస్టల్ కట్టిస్త
  • వెంకట్రావుపల్లిలో హరీశ్ హామీ 

హుజూరాబాద్, వెలుగు: ‘‘నా నియోజకవర్గంలో గొర్రెల కాపరులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు బయటకు వెళ్లి, గొర్రెలు మేపేందుకు ఇబ్బందులు తలెత్తడంతో సిద్దిపేటలో గొర్రెల హాస్టల్ కట్టించాను. హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లిలోనూ 250 మంది గొర్రెల కాపరులు ఉన్నారని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే..  నేనే వచ్చి ఇక్కడ గొర్రెల హాస్టల్ కట్టిస్తా” అని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. గురువారం హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కందుగుల, పెద్దపాపయ్య పల్లి, చిన్న పాపయ్య పల్లి, వెంకట్రావు పల్లి, సిర్సపల్లి, కాట్రపల్లి తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ‘‘మొఖం మొగులుకు పెట్టి చూసే బాధలు లేకుండా.. రైతులకు కడుపు నిండా కరెంట్, కాల్వ నిండుగా నీళ్లు అందిస్తున్నాం. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీన్ని అమలు చేసే యోచనలో ఏపీ సీఎం ఉన్నారు. కానీ ప్రాణం పోయినా రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టనివ్వమని సీఎం కేసీఆర్ అంటున్నారు” అని హరీశ్  చెప్పారు. 
అందుకే ఈటల రాజీనామా.. 
పేదలు, దళితుల భూములు లాక్కొని.. వాటిని కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారని హరీశ్ – ఆరోపించారు. ‘‘నిరుపేదలకు పథకాలు అమలు చేస్తే, వాటిని పరిగె ఏరుకున్నట్లుగా ఈటల పేర్కొన్నారు. నిరుపేదలను అవమానించి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు” అని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజార్టీతో గెల్లు గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేసిన రైతులను కార్లతో గుద్ది చంపిన చరిత్ర బీజేపీదని విమర్శించారు.