కార్పొరేటర్ అయితే నాకేంటి?.. పైసలు పడేస్త తీస్కపో

కార్పొరేటర్ అయితే నాకేంటి?.. పైసలు పడేస్త తీస్కపో
  • రోడ్డు కబ్జా చేసి ట్రాన్స్ ఫార్మర్ పెట్టొద్దన్నందుకు బిల్డర్ బెదిరింపులు
  • అక్రమ కాంపౌండ్​ను కూల్చివేసిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు  

కుషాయిగూడ, వెలుగు: ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం రోడ్డు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టొద్దన్నందుకు ఓ బిల్డర్ కార్పొరేటర్​ను బెదిరించాడు. ఈ ఘటన ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలో జరిగింది. డివిజన్ లోని సుబ్రహ్మమణ్యకాలనీలోని ఐ విజన్ సిరీస్ బిల్డర్స్ పేరుతో అపార్ట్ మెంట్లను నిర్మిస్తున్నారు. అక్కడ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం శుక్రవారం రోడ్డును కబ్జా చేసి కాంపౌండ్ వాల్​ను నిర్మిస్తున్నారు. దీంతో కాలనీ వాసులు ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీషా సోమశేఖర్ రెడ్డికి విషయం చెప్పారు. ఆమె వెంటనే అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుని బిల్డర్​కు ఫోన్ చేసి మాట్లాడారు. రూల్స్ కి విరుద్ధంగా కాంపౌండ్ వాల్​ను కట్టొద్దన్నారు. ఆమె మాటలను లెక్కచేయని బిల్డర్ ‘ నువ్వు కార్పొరేటర్ అయితే నాకేంటి? పైసలు పడేస్త తీస్కపో’ అంటూ శిరిషా సోమశేఖర్ రెడ్డిని ఫోన్ లో బెదిరించారు. దీంతో కాలనీవాసులు అపార్ట్ మెంట్ దగ్గర ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న కాప్రా జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఖద్దూస్ అక్కడికి చేరుకున్నారు. రోడ్డు కొలతలు తీసుకుని కాంపౌండ్ వాల్ అక్రమంగా కడుతున్నట్టు గుర్తించారు. దాన్ని జేసీబీతో తీసివేయించారు. ఖద్దూస్ మాట్లాడుతూ..అపార్ట్ మెంట్​కు పర్మిషన్ ఉందా లేదా అనే పూర్తి వివరాలను తెలుసుకుని బిల్డర్ పై చర్యలు తీసుకుంటామన్నారు.