గ్రేటర్ లో భవన నిర్మాణాలకు 14 రోజుల్లో అనుమతి

గ్రేటర్ లో భవన నిర్మాణాలకు 14 రోజుల్లో అనుమతి
  • కమిటీ ఆధ్వర్యంలో సమీక్షించి అనుమతులు మంజూరు
  • కమిషనర్ ఛైర్మన్ గా 8 మంది సభ్యులతో టీఎస్బీ పాస్ కమిటీ ఏర్పాటు
     

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణాల పరిశీలన.. అనుమతుల మంజూరు కోసం కొత్త విధానాన్ని అమలులోకి తెస్తోంది సర్కార్. దీని కోసం కమిషనర్ ఛైర్మన్ గా 8 మంది సభ్యులతో టీఎస్బీ పాస్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణాల దరఖాస్తులపై సమీక్షించి అనుమతులు మంజూరు చేస్తారు. ప్రతి నెలలో రెండుసార్లు కమిటి సమావేశమై అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించారు. 
నిర్ణయించిన గడువు లో అనుమతులను మంజూరు చేయాలని కమిటీకి నిర్దేశించారు. పౌరుల నుండి ఏవైనా నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత శాఖలతో చర్చించి అనుమతులు మంజూరు చేస్తారు. ప్రొవిజనల్ ఫైర్ ఎన్ ఓ సి, రెవెన్యూ ఎన్ ఓ సి ని 14 రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించారు. 
చెరువులు, కుంటల దగ్గర 200 మీటర్ల పరిధిలోని నిర్మాణలకు సంబంధించి ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఎన్ ఓ సి ని 10 రోజుల్లో ఇవ్వాలని నిర్దేశించారు. టి ఎస్ బి పాస్ లో ఇప్పటి వరకు సింగిల్ విండో లో 124, ఇన్స్టంట్ అప్రూవల్ లో 2318 భవన నిర్మాణాలకు జిహెచ్ యంసి అనుమతులు మంజూరు చేసింది.