భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గవర్నమెంట్ స్కూళ్లు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్అధికారులకు, టీచర్లకు సూచించారు. కొత్తగూడెంలోని ఆనందఖని స్కూల్లో బుధవారం ‘పచ్చదనం–పరిశుభ్రత’లో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన స్కూళ్లకు కలెక్టర్ మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1,673 స్కూళ్లకు గానూ ఆరు రూరల్ విభాగం నుంచి ఆరు, అర్బన్ ఏరియా నుంచి రెండు స్కూళ్లను ఎంపిక చేసినట్టు తెలిపారు.
పాఠశాలలు పచ్చదనంతో మెరవాలన్నారు. అన్ని పాఠశాలు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించేలా హెచ్ఎంలు, టీచర్లు కృషి చేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో జిల్లా స్కూళ్లు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఇల్లెందు మండలంలోని సత్యనారాయణపురంతో పాటు అంజనాపురం, సంజయ్ నగర్, బుడ్డగూడెం ప్రాథమిక పాఠశాలలు, భద్రాచలం పబ్లిక్ స్కూల్, అశ్వాపురంలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆటమిక్ఎనర్జీ స్కూల్, మొరంపల్లి బంజర జడ్పీ హైస్కూల్, పాల్వంచ కేజీబీవీ స్కూల్స్ హెచ్ఎంలు, టీచర్స్, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ ప్రోగ్రాంలో డీఈఓ బి.నాగలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్శంభు ప్రసాద్, కో ఆర్డినేటర్లు కె.సైదులు, నాగరాజశేఖర్ పాల్గొన్నారు.
