రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం కావాలి : ప్రొఫెసర్ కాశీం

రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం కావాలి : ప్రొఫెసర్ కాశీం
  • ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్​ కాశీం

ఖమ్మం, వెలుగు :   అసమానతలు లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం కావాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ కాశీం పిలుపునిచ్చారు.  భారత రాజ్యాంగం కులతత్వం, మతతత్వం, కార్పొరేట్ రాజకీయాల పెత్తనం, అవినీతి, లౌకికతత్వం లోపించటం, అణగారిన వర్గాల సమస్యలు, ప్రాథమిక హక్కుల అమలులో అడ్డంకులు లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయనఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంచికంటి మీటింగ్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన ‘భారత రాజ్యాంగం-, ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ లో కాశీం మాట్లాడారు.  

రాజ్యాంగ లక్ష్యాలైన సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇవి దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, లింగ, ప్రాంతం, భాష అసమానతలు లేని రాజ్యాంగాన్ని కోరుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ, పాలనలో అవినీతి పెరుగుతుందన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం లాంటి సంస్థల స్వతంత్రత లోపిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల వేదిక నాయకులు ఎం. సుబ్బారావు, నరేందర్, బాలాజీ సింగ్, ప్రశాంతి పాల్గొన్నారు.